Jaya Bachchan: పెద్ది వివాదంపై జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు
జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు
Jaya Bachchan: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్ర ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం గ్లామర్ కోసమే ఆమె పాత్రను వాడుకున్నారంటూ వస్తున్న విమర్శలపై తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి, పార్లమెంట్ సభ్యురాలు జయా బచ్చన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమాల్లో మహిళలను కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేయడాన్ని జయా బచ్చన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటివి జరిగినప్పుడు అంతా అయిపోయాక మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, సెట్‌లోనే వెంటనే అడ్డుకోవాలని నటీమణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్‌లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. గతంలో ‘షోర్’ సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ కోసం తనను గాగ్రా చోళీ వేసుకోవాలని దర్శకుడు కోరారని, అయితే చున్నీ లేనిదే తాను ఆ డ్రెస్ వేసుకోనని గట్టిగా పట్టుబట్టానని జయ తెలిపారు.
ఆ విషయంలో దర్శకుడితో పెద్ద గొడవ జరిగిందని.. ఆ తర్వాత సెట్‌లో ఎవరూ తనతో గీత దాటే ధైర్యం చేయలేదని జయా బచ్చన్ స్పష్టం చేశారు. తనను అలా చూపించడానికి ప్రయత్నించిన ఆ దర్శకుడితో మళ్లీ ఎప్పుడూ పని చేయలేదని ఆమె చెప్పుకొచ్చారు. జయా బచ్చన్ చేసిన ఈ వ్యాఖ్యలకు స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సైతం పూర్తి మద్దతు ప్రకటించారు. తెరపై రొమాన్స్ పండించడానికైనా, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికైనా అలాంటి దుస్తులు ధరించాల్సిన అవసరం లేదని కరీనా అభిప్రాయపడ్డారు.
గతంలో కాజోల్, శ్రీదేవి, షర్మిలా ఠాగూర్ వంటి మహానటీలు ఒంటినిండా దుస్తులు ధరించి కూడా కేవలం తమ అద్భుతమైన హావభావాలతోనే ప్రేక్షకులను మెప్పించారని కరీనా గుర్తుచేశారు. కాగా, ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్‌ను గ్లామర్ పరంగా చూపించిన విధానంపై పలువురు సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేయడంతో.. దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే బహిరంగంగా క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.