Jr NTR: డ్రాగన్ షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం.. రెండు నెలలు విశ్రాంతిలో స్టార్ హీరో
విశ్రాంతిలో స్టార్ హీరో
Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారన్న వార్త ప్రస్తుతం నందమూరి అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం డ్రాగన్ షూటింగ్‌లో తారక్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే సోమవారం సాయంత్రం షూటింగ్ సెట్‌లో యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా దురదృష్టవశాత్తు ఆయన భుజానికి స్వల్ప గాయమైంది. గాయం తీవ్రతను గమనించిన వెంటనే చిత్రబృందం ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ జె. మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణుల వైద్య బృందం ఆయనకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేసి చికిత్స అందిస్తోంది. భుజానికి తగిలిన గాయం పూర్తిగా నయమై, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టమైన సూచనలు చేశారు.
ఈ నేపథ్యంలో ఆయన కొంతకాలం పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉండి, పూర్తిగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, అభిమానులు , శ్రేయోభిలాషులు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ అధికారిక కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎన్టీఆర్ ఆరోగ్యం, కోలుకునే ప్రక్రియకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటామని పేర్కొంది.
తారక్ త్వరగా కోలుకుని, మునుపటి కంటే మరింత జోరుతో తిరిగి సెట్స్‌లోకి రావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో అభిమానులు 'గెట్ వెల్ సూన్ తారక్' అంటూ పోస్టులు ట్రెండ్ చేస్తున్నారు.