Satyadev: బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాగే.. రావు బహదూర్ గురించి మాట్లాడుకుంటారు: సత్యదేవ్

రావు బహదూర్ గురించి మాట్లాడుకుంటారు: సత్యదేవ్

Update: 2026-06-13 05:31 GMT

Satyadev: ఏ భాషలో మంచి సినిమా వచ్చినా గుండెల్లో పెట్టుకునే తెలుగు ప్రేక్షకుల ముందుకు.. మరో విలక్షణమైన చిత్రం రాబోతోంది. వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేశ్ మహ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'రావు బహదూర్'. ఈ సినిమా టీజర్ విడుదల వేడుక శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. సినిమాపై తనకున్న నమ్మకాన్ని గట్టిగా చాటారు. జులై 3న 'రావు బహదూర్' విడుదలైన తర్వాత.. మిగిలిన అన్ని ఇండస్ట్రీల వాళ్లూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారని, అంతలా ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

"ఈ ఏడాది అన్ని శుక్రవారాలతో పోలిస్తే.. జులై 3న వచ్చే శుక్రవారం చాలా ప్రత్యేకం. తెలుగులో ఒక క్రేజీ అండ్ మైండ్ బ్లోయింగ్ మూవీ వచ్చిందని అందరూ అనుకుంటారు. మలయాళం, తమిళ్, హిందీ ఇలా ఏ భాషలో మూవీ బాగున్నా మనవాళ్లు ఎంతగానో సపోర్ట్ చేశారు. కానీ, 'రావు బహదూర్' వచ్చిన తర్వాత ఇతర ఇండస్ట్రీలు మనల్ని సపోర్ట్ చేస్తాయి. గతంలో విదేశీయులు 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాల గురించి ఎలాగైతే గొప్పగా మాట్లాడుకున్నారో.. ఈ సినిమా గురించీ అలాగే మాట్లాడుకుంటారు" అంటూ సత్యదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు వెంకటేశ్ మహ కేవలం ఈ అద్భుతమైన కథ కోసమే ఇన్నేళ్లు వేచి చూశారని.. ఈ మూవీలో థియేటర్లలో ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తారని సత్యదేవ్ చెప్పారు. "మా రావు బహదూర్" అని మీరంతా గర్వంగా చెప్పుకొనేలా ఈ సినిమా ఉంటుందన్నారు. సినిమాలో కాస్ట్యూమ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని.. తాను ఒక సీన్ కోసం వేసుకున్న బట్టలు 1950-60 కాలం నాటివని, ముంబయిలో జరిగిన ఒక వేలంలో వాటిని కొని శిల్ప తనకు ఇచ్చారని తెలిపారు. సినిమా కోసం టెక్నికల్ టీమ్ ఎంతో కష్టపడిందని కొనియాడారు.

ఈ సినిమాకు అగ్ర కథానాయకుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాశర్, ఆనంద్ భారతి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. మూవీ పనులన్నీ పూర్తయ్యాక మహేష్ బాబుకు స్పెషల్ షో వేస్తామని.. గతంలో ‘మేజర్’ సినిమాకు కూడా ఇలాగే చేశామని, సరైన సమయంలో మహేష్ బాబు రంగంలోకి దిగుతారని ప్రొడ్యూసర్ అనురాగ్ స్పష్టం చేశారు. జులై 3న థియేటర్లలో రాబోతున్న ఈ 'రావు బహదూర్' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News