Rana Makes Key Comments: ఒంటరిగా ఉండడమే అదే తొలిసారి.. ఆరోగ్య సమస్యపై రానా కీలక కామెంట్స్..

ఆరోగ్య సమస్యపై రానా కీలక కామెంట్స్..

Update: 2026-02-19 12:31 GMT

Rana Makes Key Comments: బాహుబలి చిత్రంలో ఆజానుబాహుడైన భల్లాలదేవగా ప్రపంచాన్ని అలరించిన రానా దగ్గుబాటి, ఆ పాత్ర వెనుక తాను అనుభవించిన శారీరక, మానసిక సంఘర్షణను తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. వెండితెరపై వీరుడిగా కనిపించిన రానా, నిజ జీవితంలో ఒకానొక దశలో మృత్యువుతో పోరాడి గెలిచిన తీరును వివరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఒంటరితనం.. శస్త్రచికిత్స.. ఒక కొత్త పాఠం..

తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉందని తెలిసినప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని రానా తెలిపారు. చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన ఆ రోజులను గుర్తు చేసుకుంటూ.. "నా జీవితంలో కుటుంబాన్ని వదిలి ఒంటరిగా గడపడం అదే మొదటిసారి. ఆ ఏకాంతమే నేనెవరు? అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతికేలా చేసింది. అప్పటి నుంచే జీవితం పట్ల నా దృక్పథం పూర్తిగా మారిపోయింది" అని రానా భావోద్వేగానికి లోనయ్యారు.

సినిమాల త్యాగం.. అడ్వాన్స్‌ల వాపస్..

ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తాను అప్పటికే అంగీకరించిన కొన్ని భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని రానా వెల్లడించారు. ఒక రెజ్లర్ కథాంశంతో సినిమా చేయాల్సి ఉండగా, తన శారీరక మార్పుల వల్ల ఆ పాత్రకు న్యాయం చేయలేనని భావించి, నిర్మాతలకు అడ్వాన్స్‌ను సైతం తిరిగి ఇచ్చేశారు.

వరుణ్ తేజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు:

తన స్నేహితుడు వరుణ్ తేజ్ తనను పరామర్శించడానికి వచ్చినప్పుడు, తనలాగే ఎత్తుగా, ఫిట్‌గా ఉన్న అతడిని చూసి.. "నేను చేయాల్సిన కొన్ని సినిమాలు వరుణ్‌కు ఇస్తే బాగుంటుంది కదా" అని అనిపించిందని రానా చెప్పుకొచ్చారు.

భల్లాలదేవ గుర్తింపుతో మళ్లీ ఉత్సాహం..

అమెరికాలో చికిత్స ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో అక్కడి ఇమిగ్రేషన్ అధికారి తనను గుర్తుపట్టి కింగ్ భల్లాలదేవ అని పిలవడంతో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చి ఎంతో ఆనందం వేసిందని ఆయన తెలిపారు. అన్నింటికంటే ఆరోగ్యమే మహాభాగ్యమని ఆ సమయంలో తనకు అర్థమైందని రానా సందేశాన్ని ఇచ్చారు.

ప్రస్తుతం రానా కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు.ఇటీవలే రజనీకాంత్ సరసన వెట్టాయాన్ లో మెరిశారు. స్పై, మిరాయ్, కాంత, పరాశక్తి వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పేషించారు. ముఖ్యంగా, జై హనుమాన్ లో రానా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఫిలిం నగర్ టాక్.

Tags:    

Similar News