Naga Chaitanya: నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. ఆ కంటెంట్‌ను 24 గంటల్లోగా తీసేయాలని ఆర్డర్..

ఆ కంటెంట్‌ను 24 గంటల్లోగా తీసేయాలని ఆర్డర్..

Update: 2026-06-02 15:49 GMT

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. తన పేరు, ఫొటో, వాయిస్, కీర్తిని దుర్వినియోగం చేస్తూ ఆన్‌లైన్‌లో అశ్లీల, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ఏఐ ద్వారా సృష్టించి వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. అభ్యంతరకర కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పరువుకు భంగం కలిగిస్తున్నారు.. నాగచైతన్య ఆవేదన

గత 15 ఏళ్లుగా టాలీవుడ్‌లో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య, తన అనుమతి లేకుండా కొందరు తన వ్యక్తిత్వ హక్కులను కాలరాస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కొన్ని అశ్లీల వెబ్‌సైట్లు తన పేరును ట్యాగ్‌లు, కేటగిరీలుగా వాడుకుంటూ అభ్యంతరకర కంటెంట్‌కు తప్పుడు ప్రచారం కల్పిస్తున్నాయని, దీనివల్ల తన పరువు, ప్రతిష్ఠలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు తన అనుమతి లేకుండా తన ఫొటోలతో టీషర్టులు వంటి వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ వాణిజ్యపరంగా లాభపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

కోర్టు సంచలన తీర్పు.. 24 గంటల డెడ్‌లైన్..

ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం నాగచైతన్య వాదనలతో పూర్తిగా ఏకీభవించింది. ఆయన ఒక ప్రముఖ నటుడని, ఆయన కీర్తి, ప్రతిష్ఠలకు చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. "ఫిర్యాదుదారుడికి అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. ఒకవేళ స్టే ఇవ్వకపోతే ఆయనకు పూడ్చలేని నష్టం జరుగుతుంది" అని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాగచైతన్య పేరు, ఫొటో, వాయిస్ లేదా ఆయన వ్యక్తిత్వాన్ని సూచించే ఏ అంశాన్ని అయినా అనుమతి లేకుండా వాణిజ్యపరంగా లేదా వ్యక్తిగతంగా ఉపయోగించకూడదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్, ఫేస్ మార్ఫింగ్ వంటి టెక్నాలజీల ద్వారా ఆయనకు సంబంధించిన నకిలీ కంటెంట్ సృష్టించడాన్ని పూర్తిగా నిషేధించింది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అభ్యంతరకర లింకులు, యూట్యూబ్ వీడియోలను 24 గంటల్లోగా తొలగించాలని సంబంధిత వెబ్‌సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది.

ఈ కేసు తదుపరి విచారణను కోర్టు సెప్టెంబరు 30కి వాయిదా వేసింది.

Tags:    

Similar News