Jani Master: జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ భారీ షాక్.. సినిమాలకు సహాయ నిరాకరణ
సహాయ నిరాకరణ
Jani Master: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ తగిలింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఫెడరేషన్ నాయకత్వంపై జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు, సభ్యులను రెచ్చగొట్టేలా మాట్లాడిన తీరును ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించింది. ఆయన ప్రవర్తన సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందంటూ మండిపడింది.
విచారణకు డుమ్మా.. ఫెడరేషన్ ఫైర్!
ఈ వివాదానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఈ నెల 14న విచారణకు పిలిచినా.. జానీ మాస్టర్ హాజరు కాకపోవడంపై ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై 7 రోజుల్లోగా లిఖితపూర్వకంగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు, ఫెడరేషన్‌కు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించింది.
జానీ మాస్టర్ సినిమాలకు సహాయ నిరాకరణ!
ఈ వివాదం సద్దుమణిగి, ఫెడరేషన్ సంతృప్తి చెందే విధంగా సమస్య పరిష్కారం అయ్యే వరకు జానీ మాస్టర్ చిత్రాలకు 'సహాయ నిరాకరణ' ప్రకటిస్తున్నట్లు ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయన చేసే సినిమాలకు తమ వైపు నుంచి ఎలాంటి సహకారం ఉండదని, ఫెడరేషన్ తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ నిరాకరణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
మరోవైపు డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత తీరుపైనా ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, డ్యాన్సర్స్ ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆమెకు సూచించింది. మరి ఈ నోటీసులపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో, టాలీవుడ్‌లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి!