Malayalam star Mammootty: 32 ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ తో ముమ్ముట్టి పాదయాత్ర
ముమ్ముట్టి పాదయాత్ర
Malayalam star Mammootty: 'యాత్ర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైన మలయాళ స్టార్ మమ్ముట్టి.. మరోసారి ఇదే తరహా టైటిల్‌తో రాబోతున్నారు. సీనియర్ డైరెక్టర్ అదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో ఆయన నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రానికి ‘పాదయాత్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
శుక్రవారం ఉదయం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. 'విధేయన్' తర్వాత 32 ఏళ్లకు మమ్ముట్టి, అదూర్ కాంబోలో వస్తున్న సినిమా ఇది. 16 నేషనల్ అవార్డ్స్, 17 కేరళ స్టేట్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే సహా ఎన్నో అత్యున్నత అవార్డులను అందుకున్న అదూర్ గోపాలకృష్ణన్.. 84 ఏళ్ల వయసులో మమ్ముట్టితో సినిమా చేస్తుండడం విశేషం. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా. ఇంద్రాన్స్, గ్రేస్ ఆంటోనీ, శ్రీష్మ చంద్రన్, జీనత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మమ్ముట్టి సొంత బ్యానర్ మమ్ముట్టి కంపెనీ, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలింస్ కలిసి నిర్మిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర అనే పదం వినగానే రాజకీయాలు గుర్తొస్తాయి. గతంలో మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా 'యాత్ర'లో మెప్పించిన తీరు ఇప్పటికీ మర్చిపోలేం. పైగా ఇటీవల ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, అదూర్ గోపాలకృష్ణన్ శైలి పూర్తిగా భిన్నం. ఆయన బయోపిక్‌ల కంటే కూడా మనిషిలోని అంతర్మథనాన్ని, సామాజిక సంక్లిష్టతలను తెరకెక్కించడంలో దిట్ట. కాబట్టి, ఈ ‘పాదయాత్ర’ ఒక వ్యక్తి జీవిత ప్రయాణం లేదా సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథ కావచ్చని సమాచారం.