Ram Charan’s Confident Statement: రాసిపెట్టుకోండి.. పెద్ది ది బెస్ట్ అవుతుంది: రామ్ చరణ్
పెద్ది ది బెస్ట్ అవుతుంది: రామ్ చరణ్
Ram Charan’s Confident Statement: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ షురూ అయింది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బెంగళూరులో గ్రాండ్‌గా ప్రెస్‌మీట్ నిర్వహించి సందడి చేసింది. ఈ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్, కన్నడ సెన్సేషన్ శివ రాజ్‌కుమార్, నిర్మాత సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రెస్‌మీట్‌లో రామ్‌చరణ్ మాట్లాడిన మాటలు అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాయి. దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత తాను ‘పెద్ది’ సినిమాతో మళ్లీ వెండితెరపైకి వస్తున్నానని చరణ్ తెలిపారు. ఈ సినిమా కోసం తాను ప్రాణం పెట్టి నటించానని.. "రాసిపెట్టుకోండి.. ఈ సినిమా ది బెస్ట్ అవుతుంది" అంటూ చరణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కన్నడ ఇండస్ట్రీ చక్రవర్తి శివ రాజ్‌కుమార్‌తో కలిసి నటించడం తన జన్మధన్యమన్న చరణ్.. అభిమానులు కోరుకున్నట్లే జాన్వీ కపూర్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రానికి దర్శకుడు బుచ్చిబాబు ప్రాణమని, ఆయన వెనుక ఉండి నడిపించిన సుకుమార్ ఈ సినిమాకు మరో కీలక వ్యక్తి అని చరణ్ కొనియాడారు.
ఇక ఈ ఈవెంట్‌లో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ మాట్లాడిన మాటలు అందరి హృదయాలను హత్తుకున్నాయి. రామ్‌చరణ్ నిజాయతీ, కష్టపడేతత్వమే అతన్ని ఈ స్థాయికి చేర్చాయని శివన్న అభినందించారు. అంతేకాదు, గతంలో ఓ సినిమా ఈవెంట్‌లో చరణ్.. ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్‌ల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి, తన తమ్ముడు దివంగత పునీత్ రాజ్‌కుమార్‌తో తనకున్న బంధం గుర్తొచ్చిందని ఎమోషనల్ అయ్యారు. ‘పెద్ది’ సినిమాలో కేవలం స్పోర్ట్స్ మాత్రమే కాదు.. అంతకు మించిన ఎమోషన్స్ ఉంటాయని శివ రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.
సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై అటు మెగా ఫ్యాన్స్‌లోనే కాకుండా, ఇటు కన్నడ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న థియేటర్లలో ‘పెద్ది’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.