Director Pavan Sadineni: టాలీవుడ్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. 'ప్రేమ ఇష్క్ కాదల్' చిత్రంతో యువ దర్శకుడిగా పరిచయమై, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేని (Pavan Sadineni) కటకటాల పాలయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

దర్శకుడు పవన్ సాధినేని తనను ప్రేమ పేరుతో నమ్మించాడని బాధిత నటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలాకాలం పాటు తనతో సహజీవనం (లివ్-ఇన్ రిలేషన్‌షిప్) చేశారని, ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి మాట దాటవేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా గోల్కొండ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి పవన్ సాధినేనిని అదుపులోకి తీసుకున్నారు.

పవన్ సాధినేని సినీ ప్రయాణం

పవన్ సాధినేని దర్శకుడిగా 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'సావిత్రి', 'సేనాపతి' వంటి చిత్రాలతో పాటు పలు విజయవంతమైన వెబ్ సిరీస్‌లను తెరకెక్కించి మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం ఆయన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా 'ఆకాశంలో ఒక తార' అనే క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన అరెస్ట్ కావడం టాలీవుడ్‌లో కలకలం రేపింది.

Tags: