Mithila Palkar Interview: సూపర్ సుబ్బు'తో మెప్పించిన మిథిలా పాల్కర్!
తెలుగు ఓటీటీ అరంగేట్రం 'సూపర్ సుబ్బు' విజయంపై మిథిలా పాల్కర్ (Mithila Palkar) ఆనందం వ్యక్తం చేశారు. లైంగిక విద్య తన సినీ ప్రయాణం గురించి పంచుకున్నారు.
బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ (Mithila Palkar) తన నటనతో, సహజ సిద్ధమైన శైలితో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల 'సూపర్ సుబ్బు' (Super Subbu) అనే తెలుగు వెబ్ సిరీస్‌తో తెలుగు డిజిటల్ రంగంలోకి (OTT) అడుగుపెట్టారు. ఈ సిరీస్‌లో తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతి పాత్రలో ఆమె చూపించిన నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ లిపికా వర్మతో మిథిలా పాల్కర్ పంచుకున్న ఆసక్తికర విషయాలు, లైంగిక విద్య (Sex Education) పై ఆమెకున్న అభిప్రాయాలు, తన నటనా ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకుందాం.
'సూపర్ సుబ్బు' విజయంతో..
తెలుగులో మొదటి సిరీస్‌కే ఇంతటి ఆదరణ రావడంపై మిథిలా పాల్కర్ స్పందించారు. దీనిపై నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ నన్ను మైమరిపిస్తోంది. విడుదలైన రెండు వారాల తర్వాత కూడా ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్యాప్ 10 జాబితాలో నిలవడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని తెలిపారు.
ఆరంభంలో అడ్డంకులు
యూట్యూబ్ వైరల్ 'కప్ సాంగ్' నుంచి ఇర్ఫాన్ ఖాన్, దుల్కర్ సల్మాన్ వంటి దిగ్గజ నటులతో పనిచేసే అవకాశం రావడంపై తన కృతజ్ఞతను చాటుకున్నారు. అయితే, మొదట్లో కుటుంబం నుంచి ముఖ్యంగా తన తాతయ్య నుంచి కొంత వ్యతిరేకత ఎదురైందని చెప్పారు. మధ్యతరగతి మరాఠీ కుటుంబానికి చెందినవారు కావడంతో, చదువు మధ్యలో ఆపేస్తుందేమోనని ఆయన భయపడ్డారట. అందుకే మాస్ మీడియాలో డిగ్రీ పూర్తిచేసి, నాటక రంగంలో అనుభవం సంపాదించిన తర్వాతే రంగుల ప్రపంచంలోకి వచ్చానని, ఆ తర్వాత కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారని గుర్తుచేసుకున్నారు.
లైంగిక విద్య, సున్నితమైన కథాంశం
'సూపర్ సుబ్బు' సిరీస్ ప్రధానంగా లైంగిక విద్య (Sex Education) ఆధారంగా తెరకెక్కింది. దీనిపై మాట్లాడుతూ మన సమాజంలో 'సెక్స్' అనే పదాన్ని ఒక నిషిద్ధ వస్తువుగా (Taboo) చూసేలా పెంచారు. కానీ లైంగిక విద్య అంటే కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు. అందులో పరస్పర అంగీకారం (Consent), పునరుత్పత్తి ఆరోగ్యం, మహిళల ఆరోగ్యం, శరీర అవగాహన వంటి అనేక ముఖ్యమైన అంశాలు ఉంటాయని ఆమె వివరించారు. ఈ కథను మొదటిసారి విన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలని భావించారట. సరైన రీతిలో హ్యాండిల్ చేయకపోతే ఈ అంశం అసభ్యంగా (Crass) మారే ప్రమాదం ఉంది. అందుకే కథనంపై పూర్తి నమ్మకం కుదిరాకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. దర్శకుడు మల్లిక్ రామ్ ఈ కథను ఎంతో ప్రామాణికంగా, హాస్యంతో పాటు సున్నితంగా తీర్చిదిద్దారని కొనియాడారు.
పాఠశాల రోజుల్లో అనుభవాలు
తన పాఠశాల రోజుల్లో లైంగిక విద్య సరైన రీతిలో అందించలేదని మిథిలా చెప్పారు. నాకు గుర్తున్నంత వరకు.. పీరియడ్స్ లేదా రుతుక్రమం గురించి తరగతులు చెప్పేటప్పుడు కేవలం బాలికలను మాత్రమే ఉంచి, అబ్బాయిలను బయటకు ఆటల కోసం పంపేవారు. కానీ అది సరికాదు. అబ్బాయిలకు కూడా ఈ అంశాలపై అవగాహన ఉండాలి. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ పల్లెటూరి పిల్లగా మార్పు
ఎప్పుడూ అర్బన్ పాత్రల్లో కనిపించే మిథిలా, తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్ర చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అయినట్లు తెలిపారు. దర్శకుడు మల్లిక్ రామ్‌ను పూర్తిగా నమ్మాను. లుక్ టెస్ట్ సమయం నుంచే తెలంగాణ గ్రామీణ మహిళల శరీర భాష (Body Language), నడక, హావభావాలు ఎలా ఉంటాయో ఆయన నేర్పించారు. నేను ఒక స్పాంజ్ లాగా వాటన్నింటినీ గ్రహించి స్క్రీన్ మీద చూపించానని వివరించారు. అలాగే, డబ్బింగ్ చెప్పకపోయినా డైలాగ్స్ మాత్రం స్వయంగా తెలుగులో చెప్పినట్లు తెలిపారు. కొత్త భాష నేర్చుకోవడం ద్వారా పాత్రకు మరింత దగ్గరవ్వవచ్చని అన్నారు.
ప్రేక్షకుల నుంచి ఉత్తమ కాంప్లిమెంట్
ఈ సిరీస్ చూసిన తెలుగు ప్రేక్షకులు "మాకు మిథిలా పాల్కర్ కనిపించలేదు. కేవలం ఒక తెలంగాణ అమ్మాయి మాత్రమే కనిపించిందని చెప్పడమే తనకు దక్కిన అతిపెద్ద ప్రశంస అని ఆనందం వ్యక్తం చేశారు.
భవిష్యత్తు ప్రణాళికలు & కొత్త ప్రాజెక్ట్‌లు
'సూపర్ సుబ్బు' విజయంతో దక్షిణ భారతదేశం నుంచి కొత్త అవకాశాలు వస్తున్నాయని, మంచి కథలు వస్తే కచ్చితంగా చేస్తానని చెప్పారు. టైప్ కాస్ట్ అవుతాననే భయం తనకు లేదని, కథలో బలం ఉంటే ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక కొత్త హిందీ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేశానని, త్వరలోనే నిర్మాతలు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తారని ముగించారు.