Aamir Khan: మూడో పెళ్లికి సిద్ధమైన మిస్టర్ పర్ఫెక్ట్.. జూలై 5న గౌరీ స్ప్రాట్‌తో ఆమీర్ ఖాన్ వివాహం..
జూలై 5న గౌరీ స్ప్రాట్‌తో ఆమీర్ ఖాన్ వివాహం..
Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ.. ఆయన తన సుదీర్ఘకాలపు స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
జూలై 5న నిరాడంబరంగా పెళ్లి..
ఆమిర్ ఖాన్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జూలై 5న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఈ జంట భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, సినీ పరిశ్రమ వర్గాల కోసం ఎలాంటి గ్రాండ్ రిసెప్షన్ వేడుకను కూడా ఏర్పాటు చేయడం లేదని తెలుస్తోంది. అయితే, ఈ పెళ్లి వార్తలపై ఆమిర్ ఖాన్ కానీ, ఆయన టీమ్ కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
25 ఏళ్ల స్నేహం.. ఆపై ప్రేమగా మారి..
గత ఏడాది మార్చిలో తన 60వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆమిర్ ఖాన్ తన ప్రేయసి గౌరీని మీడియాకు అధికారికంగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తామిద్దరం దాదాపు 25 ఏళ్లుగా మంచి స్నేహితులమని, కొన్నాళ్ల క్రితమే ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందని ఆమిర్ అప్పట్లోనే వెల్లడించారు. అప్పటి నుంచి ఈ జంట పలు సందర్భాల్లో జంటగా కనిపిస్తూ సందడి చేస్తోంది. కాగా, గౌరీకి ఇప్పటికే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఆమిర్ ఖాన్ గత వివాహాలు..
మొదటి వివాహం:
రీనా దత్తాతో జరిగింది. వీరికి జునైద్, ఇరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2002లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
రెండో వివాహం:
2005లో కిరణ్ రావును ఆమిర్ వివాహం చేసుకున్నారు. వీరికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే, మనస్పర్థల కారణంగా 2021లో వీరు కూడా విడిపోయారు.
ప్రస్తుతం ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ ప్రచారంపై అమీర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.