Multiplex Rules Introduced in Single Screens: సింగిల్ స్క్రీన్లలో మల్టీప్లెక్స్ రూల్స్: 23 థియేటర్లలో పర్సంటేజ్ సిస్టమ్ షురూ!

23 థియేటర్లలో పర్సంటేజ్ సిస్టమ్ షురూ!

Update: 2026-04-03 02:44 GMT

Multiplex Rules Introduced in Single Screens: హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు నడుస్తున్న పాత 'రెంటల్' (అద్దె) పద్ధతికి స్వస్తి పలికి, మల్టీప్లెక్స్ తరహాలోనే 'పర్సంటేజ్' (శాతం) ఆధారిత ఆదాయ పంపిణీ విధానంలోకి మారుతున్నారు. దీనివల్ల సినిమా వసూళ్లలో వచ్చే లాభాలను నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మరియు థియేటర్ యాజమాన్యం పంచుకుంటాయి.

దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ చెయిన్‌లు ఇప్పటికే ఈ పర్సంటేజ్ పద్ధతినే అనుసరిస్తున్నాయి. అయితే, హైదరాబాద్ వంటి నగరాల్లోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్లు మాత్రం ఇప్పటికీ పాత అద్దె పద్ధతిలోనే నడుస్తున్నాయి. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, మారుతున్న సినిమా పంపిణీ లెక్కల దృష్ట్యా తెలంగాణ ఎగ్జిబిటర్లు ఈ మార్పును తెచ్చారు. 2026 ఏప్రిల్ 3వ తేదీ నుంచే ఈ కొత్త విధానం అమలులోకి వచ్చింది.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అయిన సునీల్ నారంగ్, శిరీష్ రెడ్డి, బాబీ వంటి వారు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఈ మేరకు వారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సమాచారం అందించారు. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాత్రం ఈ కొత్త విధానానికి అంగీకరించలేదు. దీంతో ఆయన పరిధిలో ఉన్న విమల్ వంటి కొన్ని థియేటర్లు ఈ మార్పుకు దూరంగా ఉన్నాయి.

ప్రస్తుతానికి హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఈ పర్సంటేజ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. కొత్త ఒప్పందం ప్రకారం.. మొదటి వారంలో వచ్చే ఆదాయంలో 60 శాతం, రెండో వారంలో 50 శాతం, మూడో వారంలో 40 శాతం చొప్పున డిస్ట్రిబ్యూటర్లకు/ఎగ్జిబిటర్లకు వాటా దక్కుతుంది. ఈ నిర్ణయం టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కల్లో సరికొత్త మార్పులకు దారితీయనుంది.

Tags:    

Similar News