Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ తన తండ్రి, దివంగత లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ప్రదర్శించిన వృత్తి పట్ల నిబద్ధత, క్రమశిక్షణను మరోసారి చాటుకుంటున్నారు. ఇటీవల తన 111వ చిత్రం (గోపీచంద్ మలినేని దర్శకత్వంలో) పీరియాడికల్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో బాలకృష్ణ మోకాలిక దెబ్బతగలడంతో శస్త్రచికిత్స (మోకాలి సర్జరీ) చేయించుకున్నారు. వైద్యులు ఆయనను కనీసం రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, నిర్మాతలకు ఆర్థిక భారం పడకూడదని, షూటింగ్ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో సెప్టెంబర్‌లోనే తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు బాలయ్య సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ రకమైన అంకితభావం చలనచిత్ర పరిశ్రమకు గతంలో ఎన్టీఆర్ చూపిన మార్గాన్ని గుర్తుచేస్తోంది. ఎన్టీఆర్ కూడా నిర్మాతల శ్రేయస్సుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేవారు. 'పల్లెటూరి పిల్ల', 'సర్దార్ పాపారాయుడు' వంటి సినిమాల చిత్రీకరణ సమయంలో తీవ్ర గాయాలైనప్పటికీ, నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూనే షూటింగ్‌ పూర్తి చేసేవారు. ఇప్పుడు బాలకృష్ణ కూడా అదే బాటలో పయనిస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రస్తుత ప్రణాళిక ప్రకారం.. సెప్టెంబర్‌లో బాలకృష్ణ తన టాకీ, యాక్షన్ భాగాల షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్‌లో మిగిలిన ప్యాచ్ వర్క్, నవంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించి, చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి చిత్రబృందం సమాయత్తమవుతోంది. సంక్రాంతి విడుదలకు కూడా చర్చలు జరుగుతున్నప్పటికీ, డిసెంబర్ నెల బాలకృష్ణకు కలిసి వచ్చిన నెల కావడంతో ఆ సమయానికే తీసుకురావాలని చూస్తున్నారు. గతంలో ఆయన నటించిన పట్టాభిషేకం, లారీ డ్రైవర్, అఖండ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు డిసెంబర్‌లోనే విడుదలయ్యాయి. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే, తండ్రి చూపిన క్రమశిక్షణతో మరోసారి టాలీవుడ్‌లో బాలయ్య తన ప్రత్యేకతను చాటుకోనున్నారు.

Tags: