Nandi Awards: డిసెంబర్‌లో నంది అవార్డుల ప్రదానం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
కీలక నిర్ణయం!
Nandi Awards: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది చలనచిత్ర, టీవీ అవార్డుల ప్రదానంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించిన నంది అవార్డులను అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్‌డీసీ) చైర్మన్ పి. భరత్ భూషణ్ వెల్లడించారు. అలాగే 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి నాలుగు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. వీటిలో రెండు నిర్మాణ విభాగం అవార్డులు, మరో రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులు ఉంటాయి.
2025 సంవత్సరానికి కూడా నంది చలనచిత్ర, టీవీ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నంది సినిమా, జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమాలను అమరావతి లేదా విజయవాడలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నంది టీవీ అవార్డుల కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాలన్నింటినీ 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అవార్డుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్‌లో కమిటీల ఏర్పాటు ద్వారా ప్రారంభించనున్నారు. నవంబర్‌లో అవార్డుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. అనంతరం డిసెంబర్‌లో నంది చలనచిత్ర, టీవీ అవార్డుల ప్రదాన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నంది చలనచిత్ర అవార్డుల్లో వివిధ విభాగాలకు కలిపి మొత్తం 46 అవార్డులు అందించనున్నారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి వంటి ప్రధాన విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నారు. వీటితో పాటు జాతీయ సమైక్యతను ప్రోత్సహించే చిత్రాలు, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, విద్యాపరమైన చిత్రాలకు కూడా అవార్డులు అందించనున్నారు. తెలుగు సినిమా గురించి రచించిన ఉత్తమ పుస్తకాలకు సైతం పురస్కారాలు ఇవ్వనున్నారు.
అవార్డులు గెలుచుకున్న వారికి బంగారం, వెండి, కంచు, రాగి నందులతో పాటు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేయనున్నారు. వివిధ విభాగాల్లో మొత్తం ఎనిమిది బంగారు పతకాలను కూడా ప్రదానం చేయనున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న నంది అవార్డుల ప్రదానంపై తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. డిసెంబర్‌లో జరిగే కార్యక్రమాల ద్వారా విజేతలకు పురస్కారాలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.