Nandini Reddy: 46 ఏళ్లైనా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. ఓపెన్ అయిన నందిని రెడ్డి..
ఓపెన్ అయిన నందిని రెడ్డి..
Nandini Reddy: టాలీవుడ్‌లో అలా మొదలైంది, ఓ బేబీ, అన్నీ మంచి శకునములే వంటి ఫీల్ గుడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ దర్శకురాలు నందిని రెడ్డి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న ఆమె.. తాజాగా ఒక పాడ్‌క్యాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ఆర్థిక పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 46 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటంపై ఆమె ఎంతో బోల్డ్‌గా స్పందించారు.
పెళ్లి అనేది డూ ఆర్ డై రూల్ కాదు..
పెళ్లి గురించి నందిని రెడ్డి మాట్లాడుతూ.. "జీవితంలో పెళ్లి అనేది ఖచ్చితంగా చేసుకోవాలనే డూ ఆర్ డై రూల్ ఏమీ కాదు. నా మెంటాలిటీకి సరిపోయే వ్యక్తి నాకు దొరకలేదు. నేను నచ్చిన వాళ్లతో నాకు సింక్ అవ్వలేదు.. అందుకే నేను పెళ్లి చేసుకోలేదు" అని స్పష్టం చేశారు. ఒంటరితనం అనే అంశంపై కూడా ఆమె ఎంతో ప్రాక్టికల్‌గా స్పందించారు. "జీవితం బాగుండడానికి కేవలం మొగుడు, పెళ్లాం బంధం ఒక్కటే సరిపోదు. నా చుట్టూ స్నేహితులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, కొలీగ్స్‌తో కూడిన అద్భుతమైన ప్రపంచం ఉంది. నా పక్కన లేనిది భర్త ఒక్కడే, మిగతా అన్నీ ఉన్నాయి. అందుకే నేనెప్పుడూ లోన్లీగా ఫీల్ అవ్వలేదు" అని నందిని రెడ్డి తెలిపారు.
ఓ బేబీ లాంటి హిట్ తర్వాత కూడా అకౌంట్‌లో రూ. 25 లక్షలే..
ఆస్తులపై తనకు పెద్దగా వ్యామోహం లేదన్న నందిని రెడ్డి, తన ఆర్థిక విషయాల గురించి ఒక షాకింగ్ నిజాన్ని పంచుకున్నారు. సమంతతో తీసిన ఓ బేబీ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కూడా తన బ్యాంక్ అకౌంట్‌లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. "నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అస్సలు తెలియదు. నా పరిస్థితి చూసి ఒక స్నేహితురాలు బలవంతం చేసి రూ. 3 కోట్ల ఫ్లాట్ కొనిపించింది. ఆ తర్వాత కోవిడ్ రావడం, పేమెంట్లు స్లో అవ్వడంతో ఎలాగోలా కష్టపడి ఆ ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టగలిగాను" అని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. తన మానసిక ప్రశాంతత కోసం కొన్ని లక్షల రూపాయలు వదిలేసుకోవడానికైనా తాను సిద్ధమేనని ఆమె అన్నారు.
ఇండస్ట్రీ పార్టీలకు దూరం.. కుక్కలతోనే నా ప్రపంచం..
తనకు నాన్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎక్కువని, అందుకే సినిమా పార్టీలకు తాను చాలా దూరంగా ఉంటానని నందిని రెడ్డి చెప్పారు. వీకెండ్స్ వస్తే చాలు ఇంట్లోనే ఒంటరిగా ఉంటూ.. తనకున్న నాలుగు కుక్కలతో గడపడం, ఇల్లు క్లీన్ చేయడం, వంట చేయడం, పుస్తకాలు చదవడం, మ్యూజిక్ వినడంతోనే హ్యాపీగా గడిపేస్తానని తెలిపారు.
చివరగా.. తన మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ఎలాంటి వ్యక్తికైనా, ఎలాంటి పరిస్థితికైనా తన జీవితంలో అస్సలు స్థానం ఉండదని నందిని రెడ్డి తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.