‘The Paradise’: నాని సినీ ప్రయాణానికి 18 ఏళ్లు.. ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికరమైన అప్డేట్
అప్డేట్
‘The Paradise’: నేచురల్ స్టార్ నాని సినీ ప్రయాణంలో మరో కీలక మైలురాయి చేరుకున్నారు. 2008లో ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా పరిచయమైన నాని.. తాజాగా ఇండస్ట్రీలో 18 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
విభిన్న కథలు, పాత్రలను ఎంచుకుంటూ నాని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘అలా మొదలైంది’, ‘ఈగ’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’, ‘సరిపోదా శనివారం’ వంటి సినిమాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. ప్రేమకథలు, కుటుంబ కథలు మాత్రమే కాకుండా వైవిధ్యమైన పాత్రల్లోనూ నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ప్రస్తుతం నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇక ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌ను చిత్రబృందం వేగవంతం చేసింది. సెప్టెంబర్ 17న చెన్నైతో ప్రారంభమైన ప్రమోషనల్ టూర్.. సెప్టెంబర్ 18న బెంగళూరు, 19న కొచ్చి, సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లో జరగనున్న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో కొనసాగనుంది. మరోవైపు ఈ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ లభించగా, సినిమా రన్‌టైమ్ దాదాపు 2 గంటల 49 నిమిషాలుగా ఉంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘ది ప్యారడైజ్’కు థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడం లేదని నాని ఇప్పటికే స్పష్టం చేశారు. సినిమా గురించి ఎక్కువ విషయాలను ముందుగానే వెల్లడించకుండా, నేరుగా థియేటర్లలో ప్రేక్షకులకు అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో నాని 18 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తయిన సమయంలో విడుదలకు సిద్ధమవుతున్న ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.