Nayanthara: సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్.. వంశీ పైడిపల్లి ప్రాజెక్టులోకి నయనతార ఎంట్రీ
వంశీ పైడిపల్లి ప్రాజెక్టులోకి నయనతార ఎంట్రీ
Nayanthara: టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో తెరకెక్కనున్న భారీ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికర అప్‌డేట్ వెలువడింది. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ ఈ సినిమాలో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. "క్వీన్ వచ్చేసింది" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఈ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న నయనతార, ఇప్పటికే 75కు పైగా చిత్రాల్లో నటించారు. ఇటీవలే సంక్రాంతికి విడుదలైన మన శంకరవరప్రసాద్ లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించి మంచి విజయాన్ని అందుకున్న ఆమె, ఇప్పుడు సల్మాన్‌తో జతకట్టబోతున్నారు. కాగా ఆమె నటించిన ఒక మలయాళ చిత్రం కూడా ఏప్రిల్ 23న తెలుగులో విడుదల కానుంది. బృందావనం, ఎవడు, మహర్షి వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వంశీ పైడిపల్లి.. చివరగా విజయ్‌తో వారసుడు తీసి భారీ విజయాన్ని అందుకున్నారు. కొంత విరామం తర్వాత నేరుగా బాలీవుడ్ స్టార్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.