Niharika Konidela: ఎవరు ఎన్ని అన్నా నేను అనుకున్నది చేస్తా - మెగా డాటర్

నేను అనుకున్నది చేస్తా - మెగా డాటర్

Update: 2026-03-31 14:01 GMT

Niharika Konidela: నటిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్నారు నిహారిక కొణిదెల. కమిటీ కుర్రోళ్లు వంటి విజయవంతమైన చిత్రం తర్వాత, తన స్వంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై ఆమె నిర్మించిన తాజా చిత్రం రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 03న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక తన నిర్మాణ అనుభవాలను, భవిష్యత్తు ఆశయాలను పంచుకున్నారు.

విమర్శలు ఉన్నా.. నా బాట నాదే

నిర్మాతగా ప్రయాణం అంత సులభం కాదని నిహారిక పేర్కొన్నారు. "ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు చాలామంది రకరకాల సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు వీఎఫ్‌ఎక్స్ తో చాలా ఇబ్బందులు ఉంటాయని, పెద్ద సినిమాలే ఈ విషయంలో కష్టపడుతున్నాయని నన్ను హెచ్చరించారు. కానీ ఎవరు ఎన్ని మాటలు అన్నా నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటాను" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఒక మంచి సినిమా తీశామని, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని నిహారిక తెలిపారు. అవసరమైతే ఇంటింటికి వెళ్లి సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా సిద్ధమని ఆమె తన నిబద్ధతను చాటుకున్నారు. కమిటీ కుర్రోళ్లు సినిమా ద్వారా 11 మంది కొత్త నటీనటులను పరిశ్రమకు పరిచయం చేశానని, ప్రతిభ ఉన్న వారికి అవకాశం ఇవ్వడమే తన లక్ష్యమని ఆమె గుర్తు చేశారు. కేవలం సినిమాలు తీయడమే కాకుండా తన బ్యానర్‌లో పనిచేసే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్థిరపడాలని, అందరికీ సొంత ఇల్లు, కారు ఉండాలనేదే తన బలమైన కోరికని నిహారిక తన ఉదారతను చాటుకున్నారు.

Tags:    

Similar News