The Paradise: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ. ది ప్యారడైజ్‌ విడుదలకు ముస్తాబవుతోంది. సెప్టెంబరు 24న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ట్రైలర్‌ను విడుదల చేయడం లేదంటూ హీరో నాని సంచలన విషయాన్ని వెల్లడించారు.

క్వాలిటీ కోసమే ఆ నిర్ణయం

సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ట్రైలర్‌ను తీసుకురావడం లేదని నాని స్పష్టం చేశారు. విడుదలకు చాలా తక్కువ సమయం ఉందని, ట్రైలర్ కట్‌ కోసం నాలుగు ఐదు రోజులు కేటాయిస్తే తుది మెరుగుల పనులకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. ప్రస్తుతం తమ పూర్తి దృష్టి సినిమాను ఉత్తమ ఔట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపైనే ఉందని పేర్కొన్నారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విజన్‌పై ప్రశంసలు

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పట్టుదల, సినిమాపై అతనికున్న అంకితభావాన్ని నాని కొనియాడారు. దసరా నుంచి ది ప్యారడైజ్‌ వరకు పాటల విజయంలో సంగీత దర్శకులతో పాటు దర్శకుడి ఆలోచన కూడా ప్రధాన కారణమని తెలిపారు. పాత్ర ఆహార్యం విషయంలో జడలు, చేతిపై పచ్చబొట్టు వేయడాన్ని తాను ఎంతో ఇష్టపడి చేశానని.. సోషల్ మీడియా ట్రోల్స్‌కు బెదరకుండా తన కథను నిజాయతీగా నడిపించే దర్శకుడని అభినందించారు.

కెరీర్‌లోనే అత్యంత కష్టమైన చిత్రం

తన సినీ కెరీర్‌లోనే ది ప్యారడైజ్‌ అత్యంత శ్రమతో కూడిన చిత్రమని నాని చెప్పారు. టీజర్‌లోని సంభాషణలపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ.. కథలోని నేటివిటీ, పాత్ర ఔచిత్యం దెబ్బతినకుండా ఉండటానికే ఆ శైలిని ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఇది కేవలం పాన్-ఇండియా లేబుల్ కోసం చేసిన ప్రాజెక్ట్ కాదని, ఇతర భాషల్లోనూ సహజంగా విడుదలవుతోందని అన్నారు. తల్లీ-కొడుకుల భావోద్వేగాల చుట్టూ సాగే ఈ కథలో హింసతో పాటు హృదయాన్ని హత్తుకునే సెంటిమెంట్ బలంగా ఉంటుందని తెలిపారు.

రన్‌టైమ్.. ప్రీమియర్లు.. కీలక వివరాలు

ఈ చిత్ర నిడివి 2 గంటల 49 నిమిషాలు ఉంటుందని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు. చిత్రంలోని ఏష నాగుల పాట కోసం అడగ్గానే కీర్తి సురేశ్ వెంటనే అంగీకరించారని దర్శకుడు తెలిపారు. షూటింగ్ సమయంలో తనకు, సిబ్బందికి చిన్నపాటి గాయాలయ్యాయని, యాక్షన్ సన్నివేశాల్లో అవి సహజమేనని నాని పేర్కొన్నారు. అలాగే మోహన్‌బాబు గారితో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవమని చెప్పారు. సినిమాకు ప్రత్యేక ప్రీమియర్లు ప్రదర్శించనున్నట్లు నిర్మాత సుధాకర్ చెరుకూరి స్పష్టం చేశారు. టికెట్ ధరల పెంపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.

Tags: