Preity Zinta: మారుతున్న కాలంతో పాటు చిత్ర పరిశ్రమలో పనిచేసే నటీనటులపై అనూహ్యమైన మానసిక ఒత్తిడి పెరిగిపోయిందని సీనియర్ తార ప్రీతి జింటా అభిప్రాయపడ్డారు. తన తాజా స్పై-యాక్షన్ కామెడీ ప్రాజెక్ట్ వైబ్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ముంబైలో మాట్లాడిన ఆమె, నేటితరం ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న పరిస్థితులను కుండబద్దలు కొట్టారు.

అప్పట్లో ప్రశాంతత.. ఇప్పుడు కెమెరాల నిఘా

తాము సినిమాల్లో బిజీగా ఉన్న రోజుల్లో చిత్రీకరణ పూర్తయితే నేరుగా సొంతింటికి వెళ్లి ప్రశాంతంగా గడిపేవాళ్లమని ప్రీతి గుర్తు చేసుకున్నారు. కానీ నేడు పాపరాజీల సంస్కృతి హద్దులు దాటిపోయిందని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన క్షణం నుంచి ఎయిర్‌పోర్ట్ దాకా ప్రతి చిన్న కదలికపై కెమెరాల నిఘా ఉంటోందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా లోలోపల ఎలాంటి మానసిక వేదనలో ఉన్నప్పటికీ.. బయటకు మాత్రం ఎప్పుడూ ట్రెండీ దుస్తులతో, నవ్వుతూ కనిపించాలనే ఒత్తిడిని సమాజం రుద్దుతోందని ఆవేదన చెందారు.

ప్రతి విషయానికీ అభిప్రాయం చెప్పాలా?

నటన అనేది ఒక వృత్తి మాత్రమే అయినప్పటికీ, సమాజంలో లేదా దేశంలో చోటుచేసుకునే ప్రతి పరిణామంపైనా సెలబ్రిటీలు బహిరంగంగా స్పందించి తీరాలనే ధోరణి పెరుగుతోందని ఆమె తప్పుబట్టారు. గతంలో సోల్జర్, సంఘర్ష్, క్యా కెహనా వంటి భిన్నమైన కథాంశాలతో అలరించిన ప్రీతి, పెళ్లి అనంతరం అమెరికాలో స్థిరపడి కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

యాక్షన్ అవతారంలో అలరించనున్న మేడమ్ హెచ్

ఇక తన తాజా ప్రాజెక్ట్ వైబ్ ద్వారా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. దర్శకుడు కునాల్ ఖేమూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తాను మేడమ్ హెచ్ అనే పవర్‌ఫుల్ యాక్షన్ రోల్ చేస్తున్నానని, ఈ వినోదాత్మక స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Tags: