Pawan Kalyan's Strong Comments: ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడ..కాకా రేపుతోన్న పవన్ కామెంట్స్

కాకా రేపుతోన్న పవన్ కామెంట్స్;

Update: 2025-07-25 05:57 GMT

Pawan Kalyan's Strong Comments: హరి హర వీరమల్లు సక్సెస్ మీట్ మూవీ యూనిట్ నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పవన్ తన సినీ జీవితంలో మొదటిసారి ఒక సక్సెస్ మీట్‌కు హాజరుకావడం విశేషం.

పవన్ కళ్యాణ్ స్పీచ్ తన మాటల్లో... నా జీవితంలో ఏదీ తేలిగ్గా దొరకదు. డిప్యూటీ సీఎం అయినప్పటికీ సినిమాను సులువుగా విడుదల చేయలేకపోయా. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పంచాయతీలు చేస్తానని అనుకున్నా కానీ సినిమా రిలీజ్ కోసం కూడా పంచాయతీలు చేయాల్సి వచ్చింది. గత వారం రోజులుగా నిద్రలేదు. నా 29 ఏళ్ల సినీ జీవితంలో ఈ సినిమా ప్రమోషన్ కోసం మాట్లాడినంతగా ఎప్పుడూ మాట్లాడలేదు.

కొంతమంది సినిమాను బాయ్ కాట్ చేస్తామని బెదిరించారు. నేను ఎక్కడో నెల్లూరులో చిన్న వీధుల్లో పెరిగిన వాడిని. ఇక్కడి వరకు రావడమే గొప్ప. నా సినిమా మిమ్మల్ని అంతగా భయపెడుతుందంటే నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరే చెబుతున్నారు. ఇది ఏమైనా క్విట్ ఇండియా ఉద్యమమా? ఇలాంటి తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. నా అభిమానులు సున్నితంగా ఉండొద్దు. జీవితాన్ని ఆస్వాదించండి. సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్‌పై ఎలా దాడి చేయాలో ఆలోచించి అలా చేయండి .

మేము మతాల గురించి చెప్పలేదు, మంచి-చెడు గురించి చెప్పాము. ఔరంగజేబు చీకటి కోణాన్ని చూపించాము. మొఘలులు గొప్పవారు అంటారు, కానీ వారే జిజియా పన్ను విధించారు. చిన్నప్పుడు జిజియా పన్ను గురించి చదువుకున్నప్పుడు చాలా బాధగా ఉండేది. ఈ సినిమాలో ఆ చారిత్రక తప్పిదాన్ని చూపించడమే నాకు నిజమైన విజయం. అక్బర్, షాజహాన్ గురించి మాట్లాడతాం కానీ, కృష్ణదేవరాయలు, రుద్రమదేవి వంటి మన రాజుల గురించి తక్కువగా ప్రస్తావించారు. చరిత్ర రాసిన వాళ్ళు మన రాజులపై చిన్నచూపు చూశారు. కోహినూర్ కంటే మనిషి విజ్ఞానం గొప్పదని సినిమాలో చూపించాము.

నేను విజయాన్ని, అపజయాన్ని ఒకేలా తీసుకుంటాను. 2019లో ఓడిపోయినప్పుడు నేను ఎంత అవమాన పడతానో చూడాలని కొందరు భావించారు. కానీ చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి రావడమే గొప్ప విజయం. సినిమా కలెక్షన్ల కంటే కూడా అది ఎంతమందికి నచ్చింది, ఎంతమందిపై ప్రభావం చూపింది అన్నదే నాకు ముఖ్యం. జీవితాన్ని, బంధాలను సీరియస్‌గా తీసుకుందాం. మహా బతికితే 100 ఏళ్లు బతుకుతాం, ఈ మాత్రానికి ఎందుకంత ద్వేషం? సంతోషంగా ఉండటం నేర్చుకుందాం.

హరి హర వీరమల్లు మొదటి భాగంలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి, రెండో భాగంలో సరిదిద్దుకుంటాం. పార్ట్-2 తొందరగా జరగాలని కోరుకుంటున్నా. సుమారు 20-30 శాతం పార్ట్-2 షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Tags:    

Similar News