Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు వన్డే కెప్టెన్సీ..? బీసీసీఐ ఏమన్నదంటే..?
బీసీసీఐ ఏమన్నదంటే..?;
Shreyas Iyer: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనున్నారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. రోహిత్ శర్మ వారసుడిగా అయ్యర్ వన్డే సారథ్యం చేపడతారని పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే, ఈ ఊహాగానాలన్నింటికీ బీసీసీఐ చెక్ పెట్టింది. శ్రేయాస్ అయ్యర్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించే విషయంలో ఎటువంటి చర్చలు జరగలేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లని, ఇందులో ఎటువంటి నిజం లేదని ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం బోర్డు వద్ద అలాంటి ప్రణాళిక ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
స్థిరంగా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్‌కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీసీసీఐ నిర్ణయంపై మాజీ ఆటగాళ్ళు, క్రికెట్ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ నిరాశను వెళ్లగక్కారు. రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో కూడా అయ్యర్ పేరు లేకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. కేవలం 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయగలమని, ప్రస్తుతం అయ్యర్ అవకాశాల కోసం వేచి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
అయ్యర్ అద్భుత ఫామ్
టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కూడా 17 మ్యాచ్‌ల్లో 604 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. గత 26 టీ20 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో 949 పరుగులు చేసి తన సత్తా చాటాడు.