Payal Rajput: ఆయనే నా హీరో..స్టేజీపైనే ఏడ్చేసిన పాయల్ రాజ్‌పుత్
స్టేజీపైనే ఏడ్చేసిన పాయల్ రాజ్‌పుత్
Payal Rajput: తెరపై తన గ్లామర్‌తో యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరించే నటి పాయల్ రాజ్‌పుత్.. తాజాగా ఒక సినిమా వేడుకలో ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. తాను అనుభవిస్తున్న కష్టాలను గుర్తుచేసుకుంటూ ఆమె ఎమోషనల్ అయిన తీరు అక్కడున్న వారందరినీ కలిచివేసింది
మంగళవారం హైదరాబాద్‌లో ‘ఫస్ట్ టైమ్’ (First Time) సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాయల్ రాజ్‌పుత్.. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ తన వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను పంచుకున్నారు.కొన్ని నెలల క్రితం తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి చెబుతూ పాయల్ ఉద్వేగానికి లోనయ్యారు. "నేను జైపూర్‌లో విపాసన కోర్సులో ఉన్న సమయంలో.. మా నాన్న క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ విషయం తెలియగానే నా ప్రపంచమే ఆగిపోయినట్లనిపించింది. మా కుటుంబానికి అది అత్యంత కష్ట సమయం. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో కూడా నాకు అర్థం కాలేదు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన తండ్రికి తనంటే ఎంత ఇష్టమో చెబుతూ.. "మా నాన్నే నా జీవితానికి హీరో. నా సినిమాలకు ఆయనే అతిపెద్ద విమర్శకుడు. నా 'ఆర్‌ఎక్స్ 100' సినిమా అంటే ఆయనకు ప్రాణం. ఇటీవల విడుదలైన నా పంజాబీ చిత్రాన్ని కూడా ఆయన చూడాలని కోరుకున్నారు" అని చెబుతూ పాయల్ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చారు.ఎమోషనల్ అయిన పాయల్‌ను మూవీ టీమ్ ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె తన బాధను అదుపు చేసుకోలేకపోయారు. వేదికపై మాట్లాడలేక, కన్నీళ్లతోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ దృశ్యాలు చూసిన పాయల్ అభిమానులు.. ఆమె తండ్రి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.