Prakash Raj: అమెరికా- ఇరాన్ యుద్ధంపై ప్రకాశ్ రాజ్ సెటైర్
ప్రకాశ్ రాజ్ సెటైర్
Prakash Raj: ప్రపంచం ఇప్పుడు మరో భారీ యుద్ధం అంచున నిలబడి ఉంది. ఇజ్రాయెల్,ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా, గ్లోబల్ పాలిటిక్స్‌ను వణికించేలా మారుతున్నాయి. క్షిపణుల మోత, బాంబుల వర్షం మధ్య మానవతా కోణం వెనుకబడిపోతుంటే.. దీని వెనుక ఉన్న అసలైన "బిజినెస్ మైండ్" ఏంటో ప్రశ్నిస్తున్నారు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.
ఎప్పుడూ సామాజిక అంశాలపై పదునైన ప్రశ్నలు సంధించే ప్రకాశ్ రాజ్, తాజాగా యూఎస్-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధంపై ఒక ఆసక్తికరమైన సెటైర్ వేశారు. యుద్ధం లక్ష్యం ఇప్పుడు కేవలం రక్షణ కాదు.. అది “హార్ముజ్” జలసంధిని తెరవడం వైపు మళ్లినట్లు కనిపిస్తోందని ఆయన వ్యంగ్యాస్త్రం విసిరారు. అంటే యుద్ధం ముసుగులో జరుగుతున్నది వ్యూహాత్మక వాణిజ్య వేట అని ఆయన అంతరార్థం.
అసలు ఏంటీ ఈ హార్ముజ్ జలసంధి? ఎందుకు దీని చుట్టూ ఇంత రచ్చ జరుగుతోంది? ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 30 శాతం ఈ చిన్న సముద్ర మార్గం ద్వారానే వెళ్తుంది. ఇది ఇరాన్ నియంత్రణలో ఉండటం అగ్రరాజ్యాలకు ఎప్పుడూ మింగుడుపడని విషయమే. ఈ మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించవచ్చనేది ఒక బహిరంగ రహస్యం.
యుద్ధం ఎప్పుడూ సామాన్యుల ప్రాణాలు తీస్తుంది.. కానీ కొందరికి మాత్రం అది లాభాలను తెచ్చిపెడుతుంది. ప్రకాశ్ రాజ్ చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఇది కేవలం దేశాల మధ్య గొడవనా? లేక చమురు మార్గాల కోసం జరుగుతున్న కుట్రనా? ఏది ఏమైనా, ప్రకాశ్ రాజ్ సంధించిన ఈ ప్రశ్న యుద్ధం వెనుక ఉన్న భౌగోళిక రాజకీయాలను మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది.