Priyanka Arul Mohan: మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ‘తులాభారం’ పనులు మొదలయ్యాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రధాన నటీనటులను పరిచయం చేయడంతో పాటు సినిమా ప్రారంభోత్సవాన్ని కూడా నిర్వహించింది. అయితే ఈ సినిమాలో రవితేజ పారితోషికంతో పాటు హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్‌కు ఇస్తున్న రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ఇరుముడి’ సినిమా విజయం తర్వాత రవితేజ తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు సమాచారం. ‘తులాభారం’ సినిమా కోసం ఆయనకు సుమారు రూ.40 కోట్ల వరకు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆయన పారితోషికంతో పాటు సినిమా వ్యాపారంలో ఆయనకు ఉండే వాటా కూడా కలిపి ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఈ సినిమాతో ప్రియాంక అరుల్ మోహన్‌కు తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నటించిన సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్‌తో పోలిస్తే, ఈసారి ఆమె భారీగా పెంచి అడిగినట్లు సినీ వర్గాల సమాచారం.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమాలో ప్రియాంక నటించింది. గత ఏడాది విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆమె మరో తెలుగు సినిమాకు సంతకం చేయలేదు. మంచి పాత్రతో పాటు తనకు తగిన పారితోషికం ఇచ్చే సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

‘తులాభారం’ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకనే తీసుకోవాలని దర్శకుడు వివేక్ ఆత్రేయ మొదటి నుంచి భావించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె అడిగిన ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు కూడా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ప్రియాంకకు మంచి డీల్ కుదిరిందనే టాక్ వినిపిస్తోంది.

అయితే, రవితేజ, ప్రియాంక పారితోషికాలకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ప్రస్తుతం వినిపిస్తున్న ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags: