R. B. Choudary: నటుడు జీవా తండ్రి, నిర్మాత ఆర్‌బీ చౌదరి కన్నుమూత

నిర్మాత ఆర్‌బీ చౌదరి కన్నుమూత

Update: 2026-05-06 03:37 GMT

R. B. Choudary: టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా దక్షిణ భారత సినీ రంగంలో ఎన్నో మరపురాని చిత్రాలను అందించిన ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ అధినేత, ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి ఇక లేరు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన దురదృష్టవశాత్తూ మరణించారు. ఈ వార్త తెలియగానే యావత్ సినీ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది.

ఉదయ్‌పూర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద దృశ్యాలను గమనిస్తే, కారు అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆ సమయంలో కారును చౌదరి నడిపారా లేక డ్రైవర్ నడిపారా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అది రాజస్థాన్ స్థానిక వాహనంగా గుర్తించారు. ఆయన తన వ్యాపార పనుల నిమిత్తం అక్కడకు వెళ్లారా లేదా షూటింగ్ పనుల మీద వెళ్లారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తండ్రి మరణవార్త విన్న నటుడు జీవా , ఆయన కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. చెన్నైలో నివాసం ఉంటున్న జీవా కుటుంబం, విషయం తెలియగానే హుటాహుటిన రాజస్థాన్‌కు బయలుదేరి వెళ్లారు. ఒక అద్భుతమైన నిర్మాతగా, అంతకు మించి ఒక మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న ఆర్‌బీ చౌదరి గారు ఇలా అకాల మరణం చెందడం ఆయన కుటుంబానికే కాకుండా, చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో ఆర్‌బీ చౌదరి పలు భాషల్లో దాదాపు 90కి పైగా చిత్రాలను నిర్మించారు. ఎంతోమంది కొత్త దర్శకులను, నటీనటులను పరిచయం చేసిన ఘనత ఆయనది. ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులకు ఏదో ఒక ప్రత్యేకతను పంచింది.

Tags:    

Similar News