Rajamouli: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ వారణాసి నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం జక్కన్న ఓ పూర్తిస్థాయి కల్పిత భాషను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో బాహుబలి చిత్రంలో కాలకేయుల కోసం మదన్ కార్కీ సాయంతో కిలికి భాషను సృష్టించి ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి, ఇప్పుడు వారణాసి చిత్రంలో అంతకుమించిన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో ఉపయోగించే నయా భాషకు కేవలం మాటలే కాకుండా సొంత లిపి, గ్రామర్ రూల్స్ (వ్యాకరణం), నిర్దిష్ట వాక్య నిర్మాణం ఉండేలా డిజైన్ చేయిస్తున్నారు. ఇందుకోసం ఓ ప్రముఖ భాషా నిపుణుడిని రంగంలోకి దించినట్లు సమాచారం.

గుహలోని రహస్యం.. కథను మలుపు తిప్పే భాష..

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సినిమాలో ఈ కల్పిత భాష సాధారణంగా వచ్చిపోయేది కాకుండా కథను కీలక మలుపు తిప్పేలా ఉండనుంది. కథానాయకుడు మహేశ్‌బాబుతో పాటు కీలక పాత్రధారులు ఓ పురాతన గుహలోకి ప్రవేశించినప్పుడు అక్కడి రాతిగోడలపై ప్రాచీన లిపి కనిపిస్తుంది. ఆ గోడలపై దాగి ఉన్న నిగూఢ రహస్యాలను ఛేదించాలంటే ఈ ప్రత్యేక భాషను డీకోడ్ చేయాల్సి ఉంటుందట. ఈ సీక్వెన్స్ సినిమాలో ప్రధాన హైలైట్‌గా నిలవనుందని సమాచారం.

ఏఐ స్వరాలు వద్దు.. ఒరిజినల్ వాయిస్ ఆర్టిస్టులే ముద్దు..

మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాల్లో, 50 భాషల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ విభిన్న భాషల డబ్బింగ్ కోసం దాదాపు 1,500 మంది వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు ఆడిషన్లు నిర్వహించనున్నట్లు తెలిసింది టెక్నాలజీ యుగంలో ఏఐ వాయిస్‌ల వాడకం పెరిగినప్పటికీ, నటీనటుల అసలైన భావోద్వేగాలు సహజంగా పలకాలంటే మానవ గొంతులే మేలని రాజమౌళి విశ్వసిస్తున్నారట.

అడ్వెంచర్ డ్రామాగా సరికొత్త సాంకేతిక హంగులతో ముస్తాబవుతున్న వారణాసి చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌లను మించిన ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు రాజమౌళి వేస్తున్న ఈ అడుగులు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.

Tags: