Ram Charan Eyes Summer Window: సమ్మర్ విండోపై కన్నేసిన మెగా పవర్ స్టార్.. ‘పెద్ది’ ముందే వస్తున్నాడా?
‘పెద్ది’ ముందే వస్తున్నాడా?
Ram Charan Eyes Summer Window: యష్ నటించిన 'టాక్సిక్' (Toxic) చిత్రం ఎటువంటి తదుపరి తేదీ ప్రకటించకుండా నిరవధికంగా వాయిదా పడటంతో, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం ముందుకు వస్తుందనే ఊహాగానాలు ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా జూన్ 4వ తేదీన 'టాక్సిక్' విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఆ స్లాట్‌ను 'పెద్ది' కైవసం చేసుకుని సమ్మర్ సెలవులను క్యాష్ చేసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే, సినిమాను అంత త్వరగా విడుదల చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం.
దర్శకుడు బుచ్చిబాబు సానా పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, తగినంత సమయం తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్ 25న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, కేవలం మూడు వారాల కోసం అంతకుముందే సినిమాను సిద్ధం చేయడం సాధ్యం కాకపోవచ్చు. అనుకున్న ప్రణాళిక ప్రకారమే జూన్ 25న రావడం ఆచరణాత్మకంగా సరైన నిర్ణయమని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. రామ్ చరణ్ మరియు శృతి హాసన్ కాంబినేషన్‌లో వచ్చే ఒక ప్రత్యేక గీతం చిత్రీకరణతో షూటింగ్ పనులకు గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే దృష్టి సారించింది. అభిమానులు జూన్ 4వ తేదీ గురించి ఆశగా ఎదురుచూస్తున్నప్పటికీ, మేకర్స్ జూన్ 25కే కట్టుబడి ఉంటారా లేక అనూహ్యంగా డేట్ మారుస్తారా అనేది వేచి చూడాలి.