‘Ramayanam’: భారతీయ సినిమా పరిశ్రమకు ఆస్కార్‌ రేసు మరింత ఉత్సాహకరంగా మారింది. నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, యశ్‌, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణం’ (Ramayana: Part 1) చిత్రాన్ని 99వ అకాడమీ అవార్డుల పరిశీలన కోసం నిర్మాతలు సమర్పించినట్లు తెలిసింది. ఈ సినిమా ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. నమిత్‌ మల్హోత్రా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కూడా బలమైన ప్రదర్శన కనబరుస్తోంది.

ఇప్పటికే అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో భారత్‌ తరఫున మరాఠీ చిత్రం ‘గోంధల్‌’ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. అలాగే టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్లాట్‌ఫామ్‌ అవార్డును గెలుచుకున్న నాగాలాండ్‌ చిత్రం ‘అంగ్‌’ కూడా ఈ విభాగంలో పరిశీలనకు అర్హత సాధించింది. అయితే ఆస్కార్‌ నిబంధనల ప్రకారం, అధికారిక ఎంట్రీతో పాటు అకాడమీ నిర్దేశించిన అర్హతలను పూర్తి చేసిన ఇతర సినిమాలు కూడా జనరల్‌ విభాగాల్లో స్వతంత్రంగా పోటీపడవచ్చు. ‘రామాయణం’ ఈ మార్గంలోనే పరిశీలనకు వెళ్లింది.

అకాడమీ అర్హతల ప్రకారం, ఒక సినిమా అమెరికాలోని ఆరు నిర్దిష్ట మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో (లాస్ ఏంజిల్స్‌ కౌంటీ, న్యూయార్క్‌ సిటీ, బే ఏరియా, చికాగో, డల్లాస్‌-ఫోర్ట్‌ వర్త్‌, అట్లాంటా) కనీసం ఏడు రోజులు వరుసగా థియేటర్లలో ప్రదర్శించబడాలి. రోజుకు కనీసం మూడు షోలు ఉండాలి. ‘రామాయణం’ నవంబర్‌ 5న విడుదలైనప్పటి నుంచి అమెరికాలో 1000కి పైగా లొకేషన్లలో ప్రదర్శనలు పొందుతోంది. ఈ నిబంధనలను పూర్తి చేసిన తర్వాత జనరల్‌ ఎంట్రీగా సమర్పించారు. కొన్ని నివేదికల ప్రకారం ఈ చిత్రాన్ని విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో కూడా పరిశీలనకు పంపినట్లు సమాచారం.

ఈ మధ్యే మరో భారతీయ లఘు చిత్రం ‘వి వర్‌ హియర్‌’ కూడా ఆస్కార్‌ బరిలో నిలిచింది. కేవలం 11 నిమిషాల నిడివి గల ఈ కామెడీ షార్ట్‌ ఫిల్మ్‌ ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో పోటీపడనుంది. ప్రణవ్‌ భాసిన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా, ఆండ్రూ స్కాట్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. అలాగే వినోద్‌ కప్రి దర్శకత్వంలో రూపొందిన ‘పైర్‌’ చిత్రం కూడా జనరల్‌ ఎంట్రీ విభాగంలో పోటీపడనుంది. హిమాలయాల నేపథ్యంలో వృద్ధ దంపతుల కథతో రూపొందిన ఈ సినిమా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పలు అవార్డులు గెలుచుకుంది.

‘రామాయణం’లో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటించారు. హన్స్‌ జిమ్మర్‌, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. బాక్సాఫీస్‌ వద్ద ప్రపంచవ్యాప్తంగా బలమైన వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఆస్కార్‌ వేదికపై కూడా భారతీయ సినిమా పతాకాన్ని ఎగురవేయాలని నిర్మాతలు ఆశిస్తున్నారు. 99వ అకాడమీ అవార్డుల వేడుక 2027 మార్చి 14న లాస్ ఏంజిల్స్‌లో జరగనుంది.

Tags: