CBFC Rule: సినిమా చివరి దశలో టైటిల్ మార్పు నిబంధనపై సీబీఎఫ్‌సీకి దక్షిణాది ఫిల్మ్ చాంబర్ల వ్యతిరేకత
ఫిల్మ్ చాంబర్ల వ్యతిరేకత
CBFC Rule: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త నియమాల్లో, చివరి దశలో సినిమా టైటిల్‌ను మార్చాలనే నిబంధనపై దక్షిణాది చిత్ర పరిశ్రమల ఫిల్మ్ చాంబర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నిబంధనను పునఃపరిశీలించాలని కోరుతూ సీబీఎఫ్‌సీకి లేఖ రాయడానికి సిద్ధమైంది. కేరళ ఫిల్మ్ చాంబర్ కూడా ఇదే విషయంపై అధికారికంగా లేఖ పంపింది.
1990 నాటి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ బాధ్యత పూర్తిగా ఫిల్మ్ చాంబర్లదే. ఆ ప్రక్రియ ప్రకారమే టైటిల్స్‌ను రిజిస్టర్ చేస్తున్నామని చాంబర్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకసారి టైటిల్ ఖరారైన తర్వాత దానితోనే పోస్టర్లు, టీజర్లు, డిజిటల్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలు, ఓటీటీ మరియు శాటిలైట్ హక్కుల లావాదేవీలు జరుగుతాయి. కోట్ల రూపాయల ప్రచారం ఆ టైటిల్ పేరుతోనే నడుస్తుంది. చిత్రీకరణ నుంచి రిలీజ్ వరకు అన్ని దశల్లో ఆ పేరుతోనే ప్రచారం చేయడం వల్ల సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. ఇప్పుడు చివరి నిమిషంలో టైటిల్ మార్చాలని చెబితే నిర్మాతలు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
టైటిల్ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, అది సినిమా ఆత్మ అని, కథలోని భావాన్ని ప్రేక్షకులకు చేరవేసే కీలక అంశమని చాంబర్లు పేర్కొంటున్నాయి. సరైన టైటిల్‌తోనే చిత్రం సగం విజయవంతమైనట్లు పరిశ్రమ నమ్ముతుంది. అలాంటి ముఖ్యమైన అంశాన్ని చట్టపరంగా స్పష్టమైన ఉల్లంఘన లేకుండా చివరి దశలో మార్చమనడం నిర్మాతల హక్కులను దెబ్బతీయడమేనని అవి స్పష్టం చేస్తున్నాయి. ఎవరైనా టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, ఆ విషయాన్ని నిర్మాత దృష్టికి తీసుకువచ్చి వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చాంబర్లు కోరుతున్నాయి.
కేరళ ఫిల్మ్ చాంబర్ తన లేఖలో స్పష్టంగా పేర్కొంది: “సెన్సార్ సభ్యులు ప్రవేశపెట్టిన ఐదు రూల్స్‌లో నాలుగింటిని మేము స్వాగతిస్తున్నాం. కానీ నిర్మాతలు ఎంచుకున్న టైటిల్ అంతిమం కాదనే రూల్‌ను మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.” టైటిల్ రిజిస్టర్ చేసుకునే ముందు అనేక ప్రక్రియలు పాటిస్తామని, ఆ తర్వాతే ఖరారు చేస్తామని అది వివరించింది. ఈ కొత్త నిబంధన వల్ల మాలీవుడ్‌తో పాటు నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన ఫిల్మ్ చాంబర్ సభ్యులు, నిర్మాతలు కలిసి ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసి, ఈ అంశంపై సీబీఎఫ్‌సీతో సంప్రదింపులు జరపాలని చూస్తున్నారు. చట్టపరంగా స్పష్టమైన సమస్య లేకుండా చివరి దశలో టైటిల్‌ను తిరస్కరించకూడదని, మార్చాలని సూచించకూడదని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.