NTR’s Home: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (తారక్) కళల పట్ల తనకున్న ప్రత్యేక అభిరుచిని మరోసారి చాటుకున్నారు. ప్రముఖ తెలుగు చిత్రకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత తోట వైకుంఠం ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ పెయింటింగ్‌ను తారక్ తన ఇంటికి తెచ్చుకున్నారు. ఈ అరుదైన కళాఖండాన్ని సొంతం చేసుకున్న సంతోషాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలతో పంచుకున్నారు.

ఇటీవల తన జూబిలీహిల్స్ నివాసాన్ని ఆధునిక హంగులతో పునరుద్ధరించుకున్న ఎన్టీఆర్, ఇంటి అలంకరణలో భాగంగా తన అభిరుచికి అనుగుణంగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్లు తెలుస్తోంది. తోట వైకుంఠం స్వయంగా ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఈ కళాఖండాన్ని ఆయనకు అందజేశారు. పెయింటింగ్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, అమ్మవారు సంప్రదాయ గ్రామీణ వాతావరణంలో కొలువుదీరినట్లు చిత్రీకరించారు. స్వామివారి సన్నిధిలో భక్తులు పూజలు చేస్తున్న దృశ్యం, నేలపై ముగ్గు, పూజా సామగ్రి అందంగా కనిపిస్తున్నాయి. భక్తి భావంతో పాటు పల్లె సంస్కృతిని మేళవించిన ఈ కళాఖండం చూపరులను ఆకట్టుకుంటోంది.

తోట వైకుంఠంతో కలిసి దిగిన ఫోటోలను, పెయింటింగ్ చిత్రాలను ఎన్టీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. “లెజెండరీ ఆర్టిస్ట్ తోట వైకుంఠం గారు ప్రత్యేకంగా రూపొందించిన ఒరిజినల్ కళాఖండాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణకు చెందిన తోట వైకుంఠం చిత్రకళా ప్రపంచంలో అంతర్జాతీయ గుర్తింపు పొందినవారు. పల్లెటూరి జీవనశైలి, గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ఆయన చిత్రాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. పచ్చని పొలాలు, కల్లు కుండలు మోసుకెళ్లే వ్యక్తులు, ఇంటి పనుల్లో నిమగ్నమైన మహిళలు, ఆలయ ఆచారాలు, పల్లె పండగలు వంటి అంశాలను తనదైన ప్రత్యేక శైలిలో కాన్వాస్‌పై ఆవిష్కరిస్తుంటారు. విలక్షణమైన రూపాలతో ఆయన సృష్టించే చిత్రాలకు దేశవిదేశాల్లో విశేష ఆదరణ, మంచి విలువ కూడా ఉంది.

ఎన్టీఆర్ ఇంతకుముందు కూడా అరుదైన పెయింటింగ్‌లను సేకరిస్తుండటం, కళా పోషణపై ఆయనకున్న ఆసక్తిని చాటుతోంది. తోట వైకుంఠం చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ ఒరిజినల్ కళాఖండం ఆయన కొత్త ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అభిమానులు ఈ అరుదైన క్షణాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. కళలను ప్రోత్సహించే ఎన్టీఆర్ ఈ చర్యకు మరింత ప్రశంసలు లభిస్తున్నాయి.

Tags: