Rashmika Mandanna Interesting Comments: ప్రతీ ఒక్కరికీ వర్క్ టైమింగ్స్ ఉండాలి.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు

రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2025-10-29 06:54 GMT

Rashmika Mandanna Interesting Comments: చిత్ర పరిశ్రమలో పనివేళలపై కొంతకాలంగా జరుగుతున్న చర్చపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గళమెత్తారు. నటీనటుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరికీ నిర్ణీత పనివేళలు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఎక్కువ గంటలు పనిచేయడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. తన కొత్త చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రష్మిక డిమాండ్

"సినిమా పరిశ్రమలో కూడా నిర్దిష్టమైన పనివేళలు ఉండాలని నేను బలంగా కోరుకుంటున్నాను. ఇది కేవలం నటులకు మాత్రమే కాదు, దర్శకుల నుంచి లైట్‌మ్యాన్ వరకు ప్రతి ఒక్కరికీ వర్తించాలి. దానివల్ల ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో గడిపేందుకు సమయం దొరుకుతుంది" అని రష్మిక అన్నారు. తాను వ్యక్తిగతంగా చాలా ఎక్కువ గంటలు పనిచేస్తున్నట్లు అంగీకరించిన రష్మిక, కంటి నిండా నిద్రపోయి చాలా నెలలు గడిచిందని తెలిపారు. అయితే తోటి నటీనటులకు ఆమె ముఖ్యమైన సలహా ఇచ్చారు. "ఒక రోజులో నిర్ణీత సమయానికి మించి పనిచేయడం సరైంది కాదు. మీరు అలా చేయకండి. వీలైతే రోజుకు 9 నుంచి 10 గంటలపాటు నిద్రపోండి. సౌకర్యవంతమైన షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం భవిష్యత్తులో మనకు ఎంతో మేలు చేస్తుంది" అని సూచించారు.

దీపికా వివాదం నేపథ్యంలో..

ఇటీవల 8 గంటల పనివేళలు డిమాండ్ చేయడం వల్లే ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పనివేళలపై రష్మిక మందన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags:    

Similar News