Rashmika Mandanna: రష్మిక మందన్న ఆగ్రహం: పాత ఆడియో క్లిప్‌పై లీగల్ వార్నింగ్!

పాత ఆడియో క్లిప్‌పై లీగల్ వార్నింగ్!

Update: 2026-03-13 06:15 GMT

Rashmika Mandanna: ప్రముఖ నటి రష్మిక మందన్న సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. గత కొన్ని రోజులుగా తన తల్లికి సంబంధించిన ఒక పాత ఆడియో క్లిప్ అంతర్జాలంలో వైరల్ అవుతుండటంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ ఆడియో క్లిప్‌లో, కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో రష్మికకు ఉన్న గత సంబంధం మరియు వారి నిశ్చితార్థం రద్దు కావడం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు ఉన్నట్లు సమాచారం. ఈ ఆడియో మళ్లీ వెలుగులోకి రావడం, అది కూడా ఆమె పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే కావడంతో దీనిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయంప్రారంభమైన తరుణంలో, పనిగట్టుకుని ఇలాంటి పాత విషయాలను బయటకు తీయడం వెనుక దురుద్దేశం ఉందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆడియో క్లిప్ సంబంధిత వ్యక్తుల అనుమతి లేకుండా రికార్డ్ చేసినదని, ఇది ముమ్మాటికీ ప్రైవసీకి భంగం కలిగించడమేనని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా, పెద్ద సంభాషణలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే కట్ చేసి, సందర్భం లేకుండా ప్రచారం చేస్తూ వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

గత ఎనిమిదేళ్లుగా తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, వేధింపులు మరియు వ్యక్తిగత దాడులను మౌనంగా భరించానని, కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడం గీత దాటడమేనని రష్మిక స్పష్టం చేశారు. "ఇన్నాళ్లూ నేను మౌనంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నా కుటుంబం మరియు నాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదు. అందుకే నేను ఒక హద్దు గీయాలని నిర్ణయించుకున్నాను" అని ఆమె తన నోట్‌లో రాశారు.

చివరిగా, ఈ ఆడియో క్లిప్‌ను ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు మరియు వ్యక్తులు వెంటనే దాన్ని తొలగించాలని ఆమె హెచ్చరించారు. 24 గంటల్లోగా ఆ కంటెంట్‌ను తొలగించకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రష్మిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన గౌరవానికి, ప్రశాంతతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఇక ఊరుకునేది లేదని ఆమె తేల్చి చెప్పారు.

Tags:    

Similar News