Ravi Teja’s New Movie: రవితేజ కొత్త మూవీ...భర్త మహాశయులకు విజ్ఞప్తి
భర్త మహాశయులకు విజ్ఞప్తి
Ravi Teja’s New Movie: గూగుల్, చాట్ జీపీటీలే కాదు.. సంసార సాగరంలో ఎంతో అనుభవం ఉన్న మొగుళ్లు కూడా చెప్పలేకపోయిన రెండు ప్రశ్నలకు సమాధానాన్ని తన రాబోయే చిత్రంలో చూడమంటున్నారు రవితేజ. ఆయన హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోమవారం ఈ విషయాన్ని తెలియజేస్తూ, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
‘‘నా జీవితంలో ఉన్న ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు.. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడాళ్లు అడగకూడదని, పెళ్లైన వాళ్లకు నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ రామసత్యనారాయణ చెప్పేదేమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి..” అంటూ తనను, తన సమస్యను రవితేజ పరిచయం చేసిన తీరు ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. అలాగే ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ కనిపించారు. ఇతర ముఖ్యపాత్రల్లో సునీల్, వెన్నెల కిషోర్, సత్య, శుభలేఖ, సుధాకర్, మురళీధర్ గౌడ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి పై ఒక ఎనర్జిటిక్ సాంగ్‌ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది.