Rockstar Anirudh: రాక్‌స్టార్ అనిరుధ్ సరికొత్త ప్రయాణం.. ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో ‘అరవింద్’ రిలీజ్!
ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో ‘అరవింద్’ రిలీజ్!
Rockstar Anirudh: టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు పాటలతో థియేటర్లను ఊపేసే రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు కేవలం సినిమా పాటలకే పరిమితమైన ఆయన, ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ (ప్రైవేట్ ఆల్బమ్స్) రంగంలోకి అడుగుపెట్టారు. 'యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా' భాగస్వామ్యంతో అనిరుధ్ స్థాపించిన సొంత స్వతంత్ర లేబుల్ "అల్బుకెర్కీ రికార్డ్స్" (Albuquerque Records) ద్వారా మొదటి పాటను విడుదల చేశారు. ఈ పాటకు "అరవింద్" (Aravindh) అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఒకే సమయంలో అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించేలా రెండు భాషల్లోనూ ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సినిమా సంగీత ప్రపంచాన్ని దాటి ఇండిపెండెంట్ మ్యూజిక్ స్పేస్‌లో తన ముద్ర వేయడానికి అనిరుధ్ తీసుకున్న ఈ నిర్ణయం మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ "అరవింద్" పాట.. నేటి డిజిటల్ యుగంలో విపరీతమైన పోటీ మధ్య తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి అల్లాడిపోయే ఒక సామాన్య వర్ధమాన సంగీతకారుడి (మ్యూజిషియన్) కథాంశంతో సాగుతుంది.
ఈ పాటలో చూపించిన 'అరవింద్' అనే పాత్ర మరెవరో కాదు.. అనిరుధ్ తన స్వంత ఆలోచనలకు, అంతరంగానికి ఇచ్చిన ఒక ప్రతిరూపం (ఆల్టర్ ఇగో). నేటి సమాజంలో ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ కలలను నిజం చేసుకోవాలని తపించే లక్షలాది మంది ఇండిపెండెంట్ ఆర్టిస్టులకు ఈ అరవింద్ పాత్ర ఒక నిదర్శనంగా నిలుస్తుంది. పాప్ మరియు హిప్-హాప్ శైలిల కలయికతో సాగే ఈ ట్రాక్.. స్వతంత్ర సంగీత విద్వాంసుడిగా కెరీర్‌ను నిర్మించుకోవడంలో ఉండే కష్టాలను మరియు నేటి వాస్తవ పరిస్థితులను కాస్త వ్యంగ్యంగా, అదే సమయంలో ఎంతో ఎమోషనల్‌గా కళ్లకు కట్టింది.
ఈ సరికొత్త పాట గురించి అనిరుధ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలోనూ ఒక "అరవింద్" దాగి ఉంటాడని, తన ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఒక మంచి అవకాశం కోసం లోలోపల ఎదురుచూస్తూనే ఉంటారని ఎంతో అర్థవంతంగా చెప్పుకొచ్చారు. మరి సినిమా పాటలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిరుధ్.. ఈ ప్రైవేట్ సాంగ్‌తో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.