S. Thaman’s Oscar Dream: థమన్ ఆస్కార్ కల.. ఆ డైరెక్టర్ మూవీతో సాధ్యమేనా?

ఆ డైరెక్టర్ మూవీతో సాధ్యమేనా?

Update: 2026-03-21 15:38 GMT

S. Thaman’s Oscar Dream: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన భవిష్యత్తు లక్ష్యం కేవలం హిట్లు కొట్టడమే కాదని, ఏకంగా ఆస్కార్ అవార్డు సాధించడమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అది కూడా తన ఆత్మబంధువు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనే సాధ్యమవుతుందని థమన్ పేర్కొనడం విశేషం.

రెహమాన్, కీరవాణిల స్ఫూర్తితో..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న థమన్, భారతీయ సంగీత దర్శకులకు ఆస్కార్ కలలను నిజం చేసిన దిగ్గజాలను గుర్తుచేసుకున్నారు. "ఏఆర్ రెహమాన్ ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’తో మనకు దారి చూపారు. ఆ తర్వాత రాజమౌళి, కీరవాణి గార్లు ఆర్ఆర్ఆర్‌ తో ఆస్కార్‌ను మన ఇంటి ముందుకు తీసుకొచ్చారు. వారిని చూశాక నాకు కూడా ఆ వేదికపై నిలబడాలనే బలమైన కోరిక కలిగింది" అని థమన్ తన మనసులోని మాటను పంచుకున్నారు.

త్రివిక్రమ్ వద్ద వందేళ్ల నాటి రామాయణం' కథ

త్రివిక్రమ్ ఆలోచనా విధానంపై థమన్‌కు ఉన్న అపారమైన నమ్మకాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు. " త్రివిక్రమ్ గారి దగ్గర వందేళ్ల పాటు గుర్తుండిపోయేలా ఒక అద్భుతమైన రామాయణం స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఆ సినిమాకు సంగీతం అందించే అవకాశం వస్తే, కచ్చితంగా ఆస్కార్ కల నెరవేరుతుంది" అని థమన్ ధీమా వ్యక్తం చేశారు. త్రివిక్రమ్ కథలకు ఆ అంతర్జాతీయ స్థాయి ఉందని ఆయన ప్రశంసించారు.

సోషల్ మీడియాలో భిన్న స్పందనలు:

థమన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. థమన్ ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటూ, ఆయన హార్డ్ వర్క్ చూస్తుంటే అది అసాధ్యం కాదని కొందరు అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు మాత్రం దీన్ని అతిశయోక్తిగా అభివర్ణిస్తూ.. "ముందు ఒరిజినల్ ట్యూన్స్ ఇవ్వండి బాసూ.. తర్వాత ఆస్కార్ గురించి ఆలోచించవచ్చు" అంటూ సెటైర్లు వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

Tags:    

Similar News