Sai Pallavi: సినిమాల్లో ముద్దు సీన్లపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు..
సంచలన వ్యాఖ్యలు..
Sai Pallavi: సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ వచ్చాక చాలామంది గ్లామర్ బాట పడతారు. కానీ, మొదటి నుంచీ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని, లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి సాయి పల్లవి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ప్రేమమ్, ఫిదా చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించిన ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినిమాల్లోని ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఆ సీన్ల కోసం విలువలు వదులుకోలేను
ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి ఎంతో నిజాయతీగా, కుండబద్దలు కొట్టినట్లు సమాధానమిచ్చారు. చాలా మంది దర్శకులు ఇప్పటికీ తనను ముద్దు సీన్లలో నటించమని అడుగుతుంటారని ఆమె తెలిపారు. అయితే కేవలం నటన కోసమే అయినా.. ఒక భాగస్వామి ఉన్నప్పుడు మరొకరిని ముద్దు పెట్టుకోవడం తన వ్యక్తిత్వానికి సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు.
డబ్బు కోసం కాదంటూ స్పష్టత
"మనిషి సంతోషంగా బతకడానికి ఒక ఇల్లు, కుటుంబం, కారు ఉంటే చాలు. దేవుడి దయ వల్ల అవన్నీ నాకు ఉన్నాయి. కేవలం లగ్జరీ జీవితం కోసమో, మరో కారు కొనడానికో నా వ్యక్తిగత విలువలను వదులుకోవాల్సిన అవసరం నాకు లేదు. కేవలం నా నటన చూసి నన్ను ఎంపిక చేసుకుంటేనే సినిమాలు చేస్తాను. కథకు ముద్దు సీన్లే ముఖ్యం అనుకుంటే నా స్థానంలో వేరే ఎవరినైనా తీసుకోవచ్చు." అని సాయి పల్లవి అన్నారు.
నెటిజన్ల ప్రశంసల జల్లు
డబ్బు, స్టార్‌డమ్ కోసం కాకుండా తను నమ్మిన సిద్ధాంతాలకు, వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యత ఇస్తున్న సాయి పల్లవిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ తరం ఇండస్ట్రీలో ఇలాంటి నటి ఉండటం అరుదంటూ నెటిజన్లు, ఆమె అభిమానులు సానుకూలంగా స్పందిస్తూ దటీజ్ సాయి పల్లవి అంటూ పోస్టులు పెడుతున్నారు.