Samyuktha Leads Action Hunt in Coal Mines: బొగ్గు గనుల్లో సంయుక్త యాక్షన్ వేట...ఐదు భాషల్లో 'ది బ్లాక్ గోల్డ్'
ఐదు భాషల్లో 'ది బ్లాక్ గోల్డ్'
Samyuktha Leads Action Hunt in Coal Mines: టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న నటి సంయుక్త, ఇప్పుడు తనలోని అసలైన యాక్షన్ కోణాన్ని చూపించేందుకు సిద్ధమైంది. ఆమె లీడ్ రోల్‌లో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ది బ్లాక్ గోల్డ్’. యోగేశ్ కేఎంసీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ సందర్భంగా విడుదల చేసిన మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మురళీ శర్మ, రావు రమేశ్, నాజర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.
ఈ సినిమా కథా నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లోని బొగ్గు గనుల కేంద్రంగా, దేశాన్ని కుదిపేసిన ‘కోల్ సిండికేట్’ స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కథలో.. సంయుక్త ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోంది. చేతిలో గన్ ఉన్నప్పటికీ, చట్టానికే ప్రాధాన్యతనిచ్చే నిబద్ధత గల ఆఫీసర్ చుట్టూ ఈ యాక్షన్ థ్రిల్లర్ తిరుగుతుంది.
మేకింగ్ వీడియో చూస్తుంటే, నిర్మాత రాజేష్ దండా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు కనిపిస్తోంది. మొత్తం ఐదు షెడ్యూల్స్, 60 రోజులకు పైగా వర్కింగ్ డేస్‌లో ఈ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో 10కి పైగా భారీ సెట్లు నిర్మించారు. ప్రతిరోజూ సుమారు 300 మందికి పైగా చిత్ర యూనిట్ సభ్యులు ఈ ప్రాజెక్ట్ కోసం శ్రమించడం చూస్తుంటే, వెండితెరపై ఒక విజువల్ వండర్ ఖాయమనిపిస్తోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ‘ది బ్లాక్ గోల్డ్’.. పాన్ ఇండియా స్థాయిలో అలరించడానికి సిద్ధమవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.