National Film Awards : ఉత్తమ నటుడిగా షారూక్‌ఖాన్, ఉత్తమ నటిగా రాణీముఖర్జీ
71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన;
- ఏడు అవార్డులు దక్కించుకున్న తెలుగు సినిమా
- ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భగవంత్ కేసరి
- బలగం, బేబీ సినిమాలకు రెండేసి అవార్డులు
జాతీయ స్ధాయిలో తెలుగు సినిమా కీర్తి పతాక రెపరెపలాడింది. కేంద్రప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ సినీ అవార్డుల్లో తెలుగు సినిమాకు ఏడు అవార్డులు దక్కాయి. 2023 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకూ సెన్సార్ అయిన సినిమాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ అధ్యక్షతన పదకొండు మంది సభ్యులతో కూడిన జ్యూరీ జాతీయ సినీ అవార్డుల విజేతలను ఎంపిక చేసింది. యథావిధిగా అవార్డులు కైవశం చేసుకోవడంలో బాలీవుడ్ జోరు స్పంష్టంగా కనిపించింది. తెలుగు భాషా చిత్రాలకు సంబంధించి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 2023 దసరా పండుగకు విడుదలైన భగవంత్ కేసరి సినిమా ఎంపికయ్యింది. 2023లో సెన్సార్ పూర్తి చేసుకుని 2024 జనవరి మాసంలో సంక్రాంతికి విడుదలై బ్లాక్‌బస్టర్ సినిమా నిలిచిన హనుమాన్ సినిమా రెండు అవార్డులు దక్కించుకుంది. ఈ సినిమాకు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్ విభాగంతో పాటు బెస్ట్ యాక్షణ్ డైరెక్షన్ అవార్డు కూడా హనుమాన్ సినిమా ఎంపికయ్యింది. అలాగే బేబీ సినిమాకు కూడా రెండు అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా సాయిరాజేష్, ఉత్తమ నేపథ్య గాయకుడిగా ప్రేమిస్తున్నా పాట పాడిన పీవీఎస్‌ఎన్ రోహిత్‌లకు అవార్డులు దక్కాయి. అదేవిధంగా బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటకు సాహిత్యం అందించిన శ్యామ్ కాసర్లకు బెస్ట్ లిరిక్ రైటర్ అవార్డు దక్కింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి బండ్రెడ్డికి ఉత్తమ బాలనటి విభాగంలో అవార్డు వచ్చింది.
ఇక హిందీ సినిమాల విషయానికి వస్తే జాతీయ ఉత్తమ నటుడిగా జవాన్ సినిమాలో లీడ్ రోల్ పోషించిన షారూక్ ఖాన్ ఎంపికయ్యారు. 33 సంవత్సరాల సినీ జీవితంలో మొట్టమొదటి సారి షారూక్ ఖాన్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో నటనకు గానూ రాణి ముఖర్జీని జాతీయ ఉత్తమ నటిగా ఎంపిక చేశారు. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా నిర్మించిన బయోగ్రఫికల్ సినిమా ట్వెల్త్ ఫెయిల్. ది కేరళ స్టోరీ సినిమాకు దర్శకత్వం వహించిన సుదీప్తో సేన్ కు జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు దక్కింది.