Shah Rukh Khan : 33ఏళ్ల తర్వాత నేషనల్ అవార్డు.. షారూఖ్ ఆస్తులెన్ని కోట్లో తెలుసా ?
షారూఖ్ ఆస్తులెన్ని కోట్లో తెలుసా ?;
Shah Rukh Khan : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. మూడు దశాబ్దాలకు పైగా సినీ పరిశ్రమను ఏలిన షారుఖ్‌కు, 33 ఏళ్ల కెరీర్‌లో తొలిసారిగా జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ ఎంపికయ్యారు. 2023లో వచ్చిన జవాన్ సినిమాలో అద్భుతమైన నటనకు గాను ఈ అవార్డు వరించింది. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ ఆస్తులు, ఆదాయం, ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.
షారుఖ్ ఖాన్ కేవలం నటుడు మాత్రమే కాదు, బిజినెస్ మాగ్నెట్ కూడా. Esquire మ్యాగజైన్ రిపోర్ట్ ప్రకారం.. షారుఖ్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ రూ.7500 కోట్లు. సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ నటుల కంటే షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ చాలా ఎక్కువ. అంతేకాకుండా, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటులలో నాలుగవ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అర్నాల్డ్, డ్వేన్ జాన్సన్, టామ్ క్రూజ్ మాత్రమే షారుఖ్ కంటే ముందున్నారు.
షారుఖ్ ఖాన్ ఆదాయం కేవలం సినిమాలపైనే ఆధారపడి ఉండదు. ఆయన సంపాదనలో ప్రధాన భాగం ఆయన సొంత నిర్మాణ సంస్థ 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్', ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్లో వాటా, వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా వస్తుంది. 2023లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన పఠాన్ సినిమాతో షారుఖ్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన జవాన్ 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. అదే సంవత్సరం, ఆయన నటించిన డంకీ ప్రపంచవ్యాప్తంగా రూ.470 కోట్లు వసూలు చేసింది.