Actor Akhil Raj: మా అమ్మను తిడితే చూస్తూ ఊరుకోవాలా., వైరల్ వీడియోపై హీరో క్లారిటీ

హీరో క్లారిటీ

Update: 2026-07-01 04:13 GMT

Actor Akhil Raj: రాజు వెడ్స్ రాంబాయ్" సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ అఖిల్ రాజ్ ఉద్దేమరి.. ఇటీవల ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌తో జరిగిన గొడవ మరియు అందుకు సంబంధించిన వైరల్ వీడియో వివాదంపై ఎట్టకేలకు స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి అసలు ఏం జరిగిందనే నిజాలను వివరిస్తూ ఆయన ఒక వీడియో స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

తాను విడుదల చేసిన వీడియోలో అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. ఆ రోజు తమ ఇంట్లో ఎవరూ ఫుడ్ ఆర్డర్ చేయలేదని, అయినా కూడా ఒక ఫుడ్ పార్సిల్ తమ ఇంటికి వచ్చిందని తెలిపారు. "మా అమ్మ ఆ పార్సిల్ తీసుకుని, ఇంట్లో ఎవరైనా ఆర్డర్ చేశారేమోనని అడిగింది. కానీ మా కుటుంబంలో ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలియడంతో ఆ పార్సిల్‌ను పక్కన పెట్టింది" అని చెప్పారు.

ఆ తర్వాత జరిగిన ఘోరాన్ని వివరిస్తూ.. "కొద్ది నిమిషాల తర్వాత ఆ డెలివరీ బాయ్ మళ్లీ మా ఇంటికి వచ్చాడు. ఉచితంగా వస్తే ఏ ఫుడ్ అయినా తీసేసుకుంటారా? అంటూ మా అమ్మను నోటికొచ్చినట్టు బూతులు తిట్టడం ప్రారంభించాడు. అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్టు కనిపించాడు. మా అమ్మపై, ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులపై ఎంతో కోపంతో, దాడి చేయడానికి వచ్చినంత ఆవేశంగా దూసుకొచ్చాడు" అని అఖిల్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక కొడుకుగా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మాత్రమే తాను మధ్యలోకి వెళ్లానని.. సదరు డెలివరీ బాయ్‌ను కేవలం మర్యాదగా మాట్లాడమని మాత్రమే అడిగానని అఖిల్ స్పష్టం చేశారు. అయితే ఆ డెలివరీ బాయ్ కావాలనే తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించి, దీనిని సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరించాడని పేర్కొన్నారు.

కథేంటో, అసలు నిజానిజాలు ఏంటో పూర్తిగా తెలియకుండానే సోషల్ మీడియాలో చాలా మంది తనను తప్పుబడుతూ విమర్శలు గుప్పించారని అఖిల్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుండే వచ్చానని, డెలివరీ బాయ్స్ పడే కష్టాలు ఏంటో తనకు బాగా తెలుసని గుర్తుచేశారు. "నేను కూడా గతంలో డెలివరీ ఉద్యోగాలు చేశాను. నా సినిమాలో కూడా ఆత్మగౌరవం (సెల్ఫ్ రెస్పెక్ట్) గురించే మాట్లాడతాను. అలాంటిది నేనెందుకు ఒక డెలివరీ బాయ్‌తో గొడవ పెట్టుకుంటాను? అలా చేయడం వల్ల నాకేం వస్తుంది? సోషల్ మీడియాలో నన్ను విమర్శిస్తున్న వారి కోసమే నేను ఈ క్లారిటీ ఇస్తున్నాను" అని అఖిల్ రాజ్ తన వీడియోను ముగించారు.

Tags:    

Similar News