Shriya Saran to Reunite With Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్, ప్రముఖ నటి శ్రియ శరణ్ కలయికలో మరో క్రేజీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుందా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా భారీ చిత్రం ధర్మన్ లో శ్రియ కూడా భాగమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల శ్రియ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రజనీకాంత్‌తో దిగిన ఫొటోను షేర్ చేస్తూ హ్యాపీ డే అని క్యాప్షన్ ఇవ్వడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండస్ట్రీ హిట్ శివాజీ: ది బాస్ చిత్రంలో రజనీ, శ్రియ జంటగా మెప్పించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఇప్పుడు దాదాపు చాలా కాలం తర్వాత ధర్మన్ కోసం ఈ ఐకానిక్ కాంబో మళ్లీ స్క్రీన్‌ను పంచుకోబోతోందనే వార్త అభిమానుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచుతోంది. ఆమె ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారా లేక ప్రత్యేక పాటలో కనిపిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరోవైపు ధర్మన్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 13న ప్రారంభమైన రెండో షెడ్యూల్ పూర్తికాగా, తాజాగా సోమవారం నుంచి హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ చిత్రీకరణ మొదలైంది. లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఈ సినిమాలో రజనీకాంత్ నేరగాళ్లను అంతమొందించే పవర్‌ఫుల్ వైద్యుడి పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Tags: