Rocking Star Yash: విజయ్ అంకితభావం నాకు స్ఫూర్తి.. టాక్సిక్ ఈవెంట్లో రాకింగ్ స్టార్ యశ్ ప్రశంసల జల్లు..
రాకింగ్ స్టార్ యశ్ ప్రశంసల జల్లు..
Rocking Star Yash: పాన్ ఇండియా స్టార్ యశ్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. చెన్నై వేదికగా ఘనంగా నిర్వహించిన తన తాజా భారీ చిత్రం ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ వేడుకలో మాట్లాడిన యశ్, విజయ్ వ్యక్తిత్వం, ఆయన క్రమశిక్షణ తనకు నిత్యం స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ విజయ్ చూపించిన అంకితభావాన్ని యశ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలు పూర్తి విశ్వాసంతో ఆయనను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారని, అదే నిబద్ధతతో ఆయన రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడు మరింత ముందుకు వెళ్తుందన్న నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు.
అలాగే తమిళ ప్రేక్షకులు మంచి సినిమాలకు అందించే ఆదరణపై యశ్ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. గతంలో కేజీఎఫ్ విడుదల సమయంలో తనకు ఎంతో మద్దతుగా నిలిచారని, భాషా భేదం లేకుండా కంటెంట్ ఉన్న చిత్రాలను గుండెల్లో పెట్టుకుంటారని గుర్తుచేసుకున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జన నాయగన్ లీకేజీ సమయంలో నిర్మాతకు అండగా నిలిచిన అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారీ అంచనాల నడుమ రూపొందిన యశ్ టాక్సిక్ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.