Singer S. Janaki: గాయని ఎస్. జానకి అంత్యక్రియలు: స్వర సామ్రాజ్ఞికి రాష్ట్ర గౌరవాలతో కన్నీటి వీడ్కోలు
కన్నీటి వీడ్కోలు
Singer S. Janaki: ప్రముఖ గాయని ఎస్.జానకి అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం కర్ణాటక మైసూరు జిల్లాలో ప్రభుత్వ లాంఛనాలు, సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. జానకి కుమారుడు మురళీకృష్ణ కుమార్తె అప్సర విద్యుల్ కర్మకాండలు నిర్వహించారు.
హెచ్‌డీ కోటె తాలూకా కణియనహుండి గ్రామంలోని జానకి వీరాభిమాని నవీన్ ఫామ్‌హౌస్‌లో ఈ అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మహారాజా కళాశాల మైదానంలో ఆమె భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనకు ఉంచారు. సంగీత దర్శకుడు హంసలేఖ, గాయకుడు విజయ్ ప్రకాశ్, చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షురాలు జయమాల, సీనియర్ నటీమణులు ఉమాశ్రీ, తారా, అనురాధ తదితరులు సహా వేలాది అభిమానులు తమ ప్రియ గాయకురాలికి నివాళులర్పించారు.
‘సూర్యచంద్రులు ఉన్నంత వరకు జానకి పాడిన పాటలు జీవించి ఉంటాయి’ అని విజయ్ ప్రకాశ్ భావోద్వేగంగా అన్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా తన సంతాప సందేశంలో “జానకమ్మ కోరుకున్నట్లుగా ఆమె పాటలు పాడేవారని” పేర్కొన్నారు.
కర్ణాటక మంత్రి డా. యతీంద్ర సిద్ధరామయ్య మాట్లాడుతూ, జానకమ్మ కోరిక మేరకు మైసూరు జిల్లాలోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, విపక్ష నేత అశోక్, బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర, ఉప ముఖ్యమంత్రి డా. పరమేశ్వర్ తదితరులు జానకి మృతికి సంతాపం తెలిపారు.
జానకి మరణం సంగీత రంగానికి తీరని నష్టమని సీఎం శివకుమార్ సంతాప సందేశంలో వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము:
“సంగీత దిగ్గజాన్ని దేశం కోల్పోయింది. ఆరు దశాబ్దాలకు పైగా 20 భాషల్లో వేలాది పాటలు పాడిన జానకి గాన మాధుర్యం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుంది” అని సంతాపం తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ:
“సంగీత ప్రపంచానికి తీరని లోటు. జానకి పాడిన మధుర గీతాలు తరాలకు అతీతంగా ప్రజలను అలరిస్తూనే ఉంటాయి” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
జానకి గానం భారతీయ సంగీత రంగంలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. ఆమె స్మృతి ఎప్పటికీ గాయకులు, సంగీత ప్రియుల హృదయాల్లో ఉంటుంది.