Sreeleela Craze: శ్రీలీల క్రేజ్.. బాలీవుడ్‌లో మరో ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ
బాలీవుడ్‌లో మరో ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ
Sreeleela Craze: టాలీవుడ్‌లో తన అందం, అభినయంతో యూత్‌ను ఆకర్షిస్తున్న యువ నటి శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్ వైపు తన అడుగులను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే ఒక హిందీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న ఆమె తాజాగా మరో భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.
జాన్వీ స్థానంలో..
ప్రముఖ నిర్మాత కరణ్ జొహార్ నిర్మిస్తున్న దోస్తానా 2 సినిమాలో శ్రీలీలను హీరోయిన్‌గా దాదాపు ఖరారు చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ పాత్ర కోసం ముందుగా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. దీంతో ఆ అద్భుత అవకాశం శ్రీలీలను వరించినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దీనిపై నిర్మాత కరణ్ జొహార్ తుది చర్చలు జరుపుతున్నారని, అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండో పెద్ద ప్రాజెక్ట్
ఇప్పటికే శ్రీలీల, బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ సరసన ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే, ఇప్పుడు రెండో పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కడం ఆమె కెరీర్‌కు కీలకంగా మారింది. ఒకదాని తర్వాత ఒకటిగా రెండు పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు రావడంతో శ్రీలీల బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.