Sri Kalyana Venkateswara Swamy: వైభవంగా ముగిసిన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు

Update: 2026-05-11 09:18 GMT

Sri Kalyana Venkateswara Swamy: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు అపూర్వ వైభవంగా నిర్వహించిన వసంతోత్సవాలు శనివారం భక్తిజనసంద్రంలో ఘనంగా ముగిశాయి. వేదఘోషాలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణల మధ్య ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడింది.

ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చనలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

అనంతరం ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపంలో వేంచేపు చేసి ఆస్థానం వైభవంగా నిర్వహించారు.

మధ్యాహ్నం 1.45 నుండి 3.30 గంటల వరకు జరిగిన స్నపన తిరుమంజనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రాజోపచారాల అనంతరం పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, గంధంతో స్వామి, అమ్మవార్లకు మహాభిషేకం నిర్వహించారు. చక్రధార, శంఖధార, సహస్రధార, మహాకలశాభిషేకాలను వైఖానస ఆగమరీతిలో అర్చకులు ఘనంగా చేపట్టారు.

ఈ సందర్భంగా పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర వేదమంత్రాలు మారుమోగగా ఆలయ ప్రాంగణం దివ్యానుభూతిని కలిగించింది. ఏడు రకాల సుగంధ పుష్పమాలలతో స్వామి, అమ్మవార్లను అర్చకులు సుందరంగా అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కాగా సాయంత్రం ఊంజల్ సేవ అనంతరం రాత్రి ఆలయ నాలుగు మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్లు విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Tags:    

Similar News