Star Hero Ajith’s Mother Passes Away: స్టార్ హీరో అజిత్ తల్లి కన్నుమూత
అజిత్ తల్లి కన్నుమూత
Star Hero Ajith’s Mother Passes Away: తమిళ చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో పెద్ద తీరని లోటు ఏర్పడింది. అజిత్ కుమార్ తల్లి మోహిని (84) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
తన కొత్త సినిమా షూటింగ్ పనుల నిమిత్తం ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న అజిత్ కుమార్‌కు.. ఈ చేదు వార్త తెలియగానే ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే దుబాయ్ నుండి అత్యవసరంగా చెన్నైకి బయల్దేరారు. కాగా, అజిత్ కుమార్ కుటుంబానికి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. కేవలం మూడేళ్ల క్రితమే అజిత్ తన తండ్రి పి.ఎస్. మణిని కోల్పోయారు. ఆ బాధ నుండి కోలుకోకముందే.. ఇప్పుడు తల్లి మోహిని కూడా మరణించడంతో అజిత్ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.
మోహిని అంత్యక్రియలను చెన్నైలోని పలవక్కంలో ఉన్న వారి కుటుంబ నివాసంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగిన అజిత్‌కు.. ప్రతి అడుగులోనూ కొండంత అండగా నిలిచిన తల్లి మోహిని మరణం తీరని లోటుగా మారింది. ఈ విషాద వార్త తెలియగానే సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్‌కు గురైంది. పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నటీనటులు,ప్రపంచవ్యాప్తంగా ఉన్న అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. అజిత్ ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.