Sunny Leone’s New Year Event: సన్నీ లియోన్ న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు
న్యూ ఇయర్ ఈవెంట్ రద్దు
Sunny Leone’s New Year Event: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రం మథురలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పాల్గొనాల్సిన నూతన సంవత్సర వేడుక రద్దయ్యింది. ఈ వేడుక నిర్వహణపై స్థానిక పూజారులు, మత పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మథుర వంటి ఆధ్యాత్మిక నగరంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని వారు స్పష్టం చేశారు.
జనవరి 1న మథురలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగే వేడుకలో సన్నీ లియోన్ డీజే (DJ)గా అలరించాల్సి ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో ద్వారా వెల్లడించారు. "కొత్త ఏడాదిని మరపురాని రాత్రిగా మార్చేందుకు జనవరి 1న నేను డీజేగా మథురకు వస్తున్నాను. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది" అని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. దాదాపు 300 మంది అతిథుల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గురించి సమాచారం బయటకు రావడంతో వివాదం మొదలైంది.
ఈ ఈవెంట్‌ను వ్యతిరేకిస్తూ కృష్ణ జన్మభూమి కేసులో ప్రధాన పిటిషనర్, ప్రముఖ హిందూత్వ నాయకుడు దినేష్ ఫలహారీ జిల్లా మెజిస్ట్రేట్‌కు లేఖ రాశారు. "మథుర ఒక దైవ భూమి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ప్రార్థనల కోసం ఇక్కడికి వస్తారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నిర్వాహకులు మతపరమైన భావాలను రెచ్చగొట్టడమే కాకుండా, పవిత్ర నగర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు" అని ఆయన సోమవారం రాసిన లేఖలో ఆరోపించారు. తక్షణమే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పెరుగుతున్న నిరసనల నేపథ్యంలో, సదరు హోటల్ యాజమాన్యం ఈ వేడుకను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హోటల్ యజమాని మితుల్ పాఠక్ మాట్లాడుతూ.. సన్నీ లియోన్ కేవలం డీజేగా మాత్రమే రావాల్సి ఉందని, మరే ఇతర ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, సామాజిక, మతపరమైన మనోభావాలను గౌరవిస్తూ ఈ ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.