‘Jailer 2’ : సూపర్‌స్టార్ రజనీకాంత్ జైలర్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..
రిలీజ్ డేట్ ఫిక్స్..
‘Jailer 2’ : భారీ యాక్షన్, మాఫియా పగ, భావోద్వేగాల మేళవింపుతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన జైలర్ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ - దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల తేదీపై గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ భారీ యాక్షన్ డ్రామాను అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
మరింత భారీగా తారాగణం
తొలి భాగంలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులైన శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ వంటి అగ్ర తారలు ప్రత్యేక పాత్రల్లో అలరించగా, సీక్వెల్‌లో ఆ సందడి మరింత రెట్టింపు కానుంది. తాజా సమాచారం ప్రకారం, బాలీవుడ్ సీనియర్ స్టార్ మిథున్ చక్రవర్తి ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
కథ ఎక్కడ మొదలవుతుందంటే?
మొదటి భాగం ముగిసిన చోటు నుంచే ఈ సీక్వెల్ కథ నేరుగా ప్రారంభమవుతుందని కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఇప్పటికే ఓ సందర్భంలో స్పష్టం చేశారు. నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, రజనీకాంత్ వింటేజ్ స్టైల్, యాక్షన్ బ్లాక్స్ ఈ చిత్రంలో అంతకుమించి ఉండబోతున్నాయని సమాచారం. జైలర్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వస్తున్న సీక్వెల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.