Suriya: సూర్య - జై భీమ్ డైరెక్టర్ క్రేజీ కాంబో రిపీట్.. కేజీఎఫ్ మేకర్స్ నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్ షురూ..
భారీ ప్రాజెక్ట్ షురూ..
Suriya: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న బ్లాక్‌బస్టర్ హిట్ జై భీమ్ తర్వాత సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కలయికలో మరో ప్రతిష్టాత్మక చిత్రం పట్టాలెక్కింది. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. సూర్య-హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్‌తోనే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సోమవారం చెన్నైలో ఈ కొత్త చిత్రం ముహూర్తపు వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. పవర్‌ఫుల్ అండ్ గ్రిట్టి కమర్షియల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ముహూర్తపు వేడుక విశేషాలు.. సాంకేతిక నిపుణులు..
ఈ సినిమాలో సూర్య సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తోంది. సాయి అభ్యంకర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎస్.ఆర్. కతిర్ కెమెరామెన్‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు.
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో వెట్టైయాన్ వంటి భారీ చిత్రాన్ని పూర్తి చేసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా సూర్యతో ఈ సరికొత్త ప్రాజెక్ట్‌ను లైన్‌లోకి తెచ్చారు. ఇటీవలే కరుప్పు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సూర్య.. ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తన విశ్వరూపం చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
ది వన్ - సూర్యకు హోంబలే ఫిల్మ్స్ స్వాగతం..
ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. మూడు దశాబ్దాలుగా సూర్య సినీ ప్రస్థానాన్ని, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకునే ఆయన నిర్భయ వైఖరిని ప్రశంసించారు. "సౌకర్యాన్ని కాదని ఎల్లప్పుడూ ధైర్యాన్నే ఎంచుకుంటూ, తెరపై సత్యాన్ని ఆవిష్కరించే ఈ తరం అత్యంత సాహసోపేతమైన నటుడు సూర్య. అలాంటి ది వన్ - సూర్యతో కలిసి ప్రయాణం చేయడం మాకు ఎంతో గర్వంగా ఉంది. మా నిర్మాణ విలువలు, సూర్య గారి అద్భుత నటన కలిసి ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందిస్తాయి" అని హోంబలే ఫిల్మ్స్ పేర్కొంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్, విడుదల తేదీ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.